మమతాబెనర్జీ పెద్ద “రిగ్గింగ్ రాణి” : సువెందు అధికారి

Queen Of Rigging

queen of rigging ఎన్నికల్లో అక్రమంగా గెలవడం కోసం కేంద్రంలోని బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ఓటమి తప్పదనుకుంటే పోలింగ్ బూత్ లను రిగ్గింగ్ చేస్తుందని, ఈవీఎం యంత్రాలను ట్యాంపర్ చేయడానికీ వెనుకాడబోదంటూ తాజాగా ఓ ఎన్నికల ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో ఆమెతో తలపడుతోన్న బీజేపీ నేత సువేందు అధికారి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మమతపై అదే స్థాయిలో మండిపడ్డారు.

మమతా బెనర్జీనే పెద్ద “రిగ్గింగ్ క్వీన్”అని సువేందు అధికారి విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం మమతకు ఏమాత్రం ఇష్టం లేదని, రాబోయే ఓటమికి సాకులుగా ఈవీఎం, రిగ్గింగ్ లను చూపాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా టీఎంసీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని, చొరబాటుదార్లను మరియు పాకిస్తానీలను ప్రేరేపిస్తోందని,అయినా, పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని సువెందు మండిపడ్డారు. కానీ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని సువెందు తెలిపారు.

గురువారం ఓ బీజేపీ ప్రచార రథాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని సువెందు తెలిపారు. బీజేపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేసింది టీఎంసీ నేతలు కాదని, ఓ కమ్యూనిటీకి చెందిన కొందరు వ్యక్తులకు దాడులు చేయమని ఆదేశాలు అందాయని తెలిపారు. వాళ్లు ప్రతిరోజూ దాడులు చేస్తున్నారని,ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. వాళ్లు పాకిస్తానీలని సువెందు తెలిపారు. పాకిస్తానీలపై భారత్ విజయం సాధిస్తుందని తెలిపారు.

పశ్చిమ బెంగాల్ లో బీజేపీపై గెలిచిన తర్వాత ఢిల్లీలోని కేంద్ర సర్కారును సైతం షేక్ చేస్తానని గురువారం సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై సువెందు స్పందిస్తూ.. కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని మమత పదే పదే మాట్లాడుతున్నారని, 2019 ఎన్నికల సమయంలో యునైటెడ్ ఫ్రంట్ అంటూ తెగ ప్రచారం చేశారని, ఆ విషయం ఏమైందో చెప్పాలని ఎద్దేవా చేశారు.

294 సీట్లున్న బెంగాల్ అసెంబ్లీకి ఈనెల 27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో పోలింగ్ జరుగనుంది. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.