ఆస్తులు అటాచ్ చేసి షాక్ ఇచ్చిన ఈడీ.. స్పందించిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా

ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

Raj Kundra properties attaches: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులను ఈడీ కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. బిట్‌కాయిన్ స్కాం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే శిల్పాశెట్టి దంపతులపై చర్యలు చేపట్టింది. శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.98 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది ఈడీ.

ఈడీ అటాచ్ చేసిన వాటిలో జుహూలోని ఓ ఫ్లాట్‌ శిల్పా శెట్టి పేరు మీద ఉంది. దీంతో పాటు పుణెలోని ఓ బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్‌ చేసినట్లు ఈడీ ప్రకటించింది.

ముంబైకి చెందిన వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ 2017లో గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌ను ఆర్గనైజ్ చేసింది. బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌ చేసి ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీలో జనాల నుంచి 6వేల 6వందల కోట్లకుపైగా వసూలు చేశారు. ఈ స్కాం బయటపడటంతో వేరియబుల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు పెట్టి దర్యాప్తు చేపట్టింది.

బిట్‌కాయిన్‌ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ అమిత్ భరద్వాజ్‌ నుంచి రాజ్కుంద్రా 285 బిట్‌కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వీటితో యుక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ పెట్టాలని రాజ్‌కుంద్రా ప్లాన్ చేసినట్లు ఆరోపించింది. ఈ బిట్ కాయిన్లు ఇప్పటికీ రాజ్‌కుంద్రా దగ్గర ఉన్నాయని, ప్రజెంట్ మార్కెట్ రేటు ప్రకారం వాటి విలువ 150కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది ఈడీ. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్‌ చేసింది.

బిట్‌కాయిన్ స్కాంలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసింది ఈడీ. సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నితిన్ మహాజన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితులు అభయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ పరారీలో ఉన్నారు.

Also Read: లోక్‌స‌భ‌ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ.. హస్తం పార్టీ ఆశలు ఫలిస్తాయా?

శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అడల్ట్ ఫిలిమ్స్ కేసులో 2021లో జైలుకు వెళ్లారు. రెండు నెలల జ్యుడిషియల్ కస్టడీ తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంకా అతని బిజినెన్‌ వ్యవహారాల్లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజ్‌కుంద్రా.

తనదైన శైలిలో స్పందించిన రాజ్‌కుంద్రా
తన ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై రాజ్‌కుంద్రా తనదైన శైలిలో స్పందించారు. మీరు అగౌరవంగా భావించినప్పుడు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవడం అనేది వేరే రకం ఎదుగుదల అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు