మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి రెడీ అయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని గవర్నర్ పై ఫైర్ అయిన శివసేన… రాష్ట్రపతి పాలన అమలయ్యాక కాంగ్రెస్, ఎన్సీపీతో తాపీగా చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న శివసేన, ఎన్సీపీ నాయకులు ఇవాళ గవర్నర్‌ను కలవబోతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరబోతున్నారు.
గవర్నర్ రేపో, ఎల్లుండో ప్రభుత్వ ఏర్పాటుకి పిలిచే అవకాశాలుంటాయి. ఇవాళ గవర్నర్ తో చర్చల తర్వాత… రేపు (ఆదివారం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవనున్నారు శరద్ పవార్… అన్నీ అనుకున్నట్లే జరిగితే… శివసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం..ఐదేళ్ల పాటూ సీఎం పదవితోపాటూ… 16 మంత్రి పదవులు శివసేనకు దక్కబోతున్నాయి. ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి, 12 మంత్రి పదవులు ఇస్తున్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి? కేబినెట్‌లో ఏ పార్టీ మంత్రులు ఎంత మంది ఉంటారు? ఏయే కార్యక్రమాలు అమలు చెయ్యాలి? ఏ పథకాలు తేవాలి ఇలాంటి అంశాలపై మూడు పార్టీలూ చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మొత్తం 40 రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సమాచారం.