గంటగంటకు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఎన్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే బీజేపీకి సరైన బలం లేదని మిగిలిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ, గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారి పిటీషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
తమకు 144 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని పిటిషన్‌లో వెల్లడించాయి పార్టీలు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ను ఆహ్వానించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరాయి. ఈ క్రమంలోనే ఆదివారం(24 నవంబర్ 2019) ఉదయం 11.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఆహ్వానించడంపై పార్టీలు తప్పు పట్టిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్‌సీపీకి చెందిన అజీత్ పవార్ ప్రమాణం చేయగా.. వారికి తగిన బలం లేదని, దీనిపై సుప్రీం కోర్టు అత్యవసర విచారణ జరపాలని పార్టీలు కోరుతున్నాయి. అయితే బల పరీక్ష నిర్వహించడానికి వారం గడువు కోరింది ప్రభుత్వం. కానీ, శివసేన కోరినట్టు సుప్రీం కోర్టు బల పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తే ‘మహా’ రాజకీయం మరింత రసివత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది.