రంజుగా మహా రాజకీయం : శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది

  • Publish Date - November 2, 2019 / 11:44 AM IST

మహారాష్ట్రలో రంజుగా రాజకీయం నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటినా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కాలేదు. దీంతో రాష్ట్రపతి పాలనను బీజేపీ తెరపైకి తెచ్చింది. దీనిపై శివసేన పైర్ అయ్యింది. బీజేపీ ఫెయిల్ అయితే..శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శివసేన సీనియర్‌ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే..సాధించాల్సిన మేజిక్ ఫిగర్‌ను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి..తమకు మద్దతిస్తున్న వారి లేఖలు ఉన్నాయని, బీజేపీ ఈ విషయంలో విఫలం చెందితే..తాము గవర్నర్ వద్దకు తీసుకెళుతామన్నారు. రాష్ట్రపతి పాలన విధించడమంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేను బెదిరించడమే అన్నారు. బీజేపీ రాష్ట్రపతి పాలన పేరిట బెదిరించి అధికారంలోకి రావాలని చూస్తే మహారాష్ట్ర ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు. 

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నేత హుసేన్ దల్వాయి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. మద్దతివ్వకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలకు దిగే అవకాశం ఉందని అలర్ట్ చేశారాయన. ఇదిలా ఉంటే..ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌తో ఉద్ధవ్‌ థాక్రే ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 56 మంది ఎమ్మెల్యేలున్న శివసేనకు ఎన్సీపీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది.

బీజేపీ..ఎన్సీపీ మద్దతు కూడగట్టగలిగితే శివసేనకు చెక్‌ పెట్టే అవకాశం కూడా ఉంది. శివసేనకు మద్దతు ఇచ్చేదానిపై ఇప్పటివరకు ఎన్సీపీ – కాంగ్రెస్‌ ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి పదవిపై శివసేన పట్టువీడడం లేదు. 50- 50 ఫార్ములా ప్రకారం పదవులు చెరిసగం పంచుకోవాలని శివసేన, సీఎం పదవిని శివసేనకు ఇచ్చేది లేదని బీజేపీ మంకుపట్టు పట్టాయి.
Read More : చంద్రయాన్ కథ ముగియలేదు : ఇస్రో ఛైర్మన్ కె.శివన్