Karnataka CM post: కర్ణాటక సీఎం ఎవరు..? ఢిల్లీకి వెళ్లే ముందు శివకుమార్ కీలక వ్యాఖ్యలు.. సిద్ధ రామయ్యకు లైన్ క్లియర్ అయినట్లేనా?

పలు దఫాలుగా సమాలోచనల అనంతరం సిద్ధ రామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపినట్లు వార్తలు వస్తున్నాయి.. తాజాగా శివకుమార్ ఢిల్లీకి వెళ్లేందుకు ముందు చేసిన వ్యాఖ్యలను బట్టిచూస్తుంటే ఆ వార్తలు ..

Siddaramaiah and DK Shivakumar

Karnataka New CM: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత సిద్ధ రామయ్య, కర్ణాటక పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లలో ఎవరికి సీఎం పదవి వరిస్తుందనే అంశంపై కర్ణాటక రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా చర్చజరుగుతుంది. మే18న నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని టాక్ వినిపిస్తున్నక్రమంలో.. కర్ణాటక సీఎం ఎవరు అనే విషయంపై నేడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధ రామయ్య ఢిల్లీ వెళ్లగా.. ఈరోజు ఉదయం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. వీరు ఢిల్లీలో ఉండగానే.. వీరిలో ఒకరిపేరును సీఎంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఢిల్లీకి వెళ్లే ముందు శివకుమార్ ఏమన్నారంటే?

కర్ణాటక సీఎం నిర్ణయంపై తీవ్ర గందరగోళం నెలకొనిఉన్న నేపథ్యంలో సిద్ధ రామయ్య, శివకుమార్‌లకు ఢిల్లీకి రావాలని సోమవారమే పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సిద్ధరామయ్య సోమవారమే ఢిల్లీ వెళ్లారు. శివకుమార్ కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా బెంగళూరులోనే ఉన్నారు. మంగళవారం ఉదయం ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి వెళ్లేముందు ఏఎన్ఐ తో శివకుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాది ఉమ్మడి కుటుంబం. మా సంఖ్య 135. ఇక్కడ ఎవరినీ విభజించడం నాకు ఇష్టం లేదని చెప్పారు. సోనియా గాంధీ నా రోల్ మోడల్ అన్న ఆయన.. పార్టీ నాకు తల్లిలాంటిదని చెప్పారు. ఒక పిల్లాడికి ఏమి ఇవ్వాలో తల్లికి తెలుసు. వాళ్లకు నచ్చినా, నచ్చకపోయినా నేను బాధ్యతగల మనిషిని, వెన్నుపోటు పొడవడం, బ్లాక్ మెయిల్ చేయడం నాకు రాదని శివకుమార్ అన్నారు.

 

మా తదుపరి లక్ష్యం అదే..

ప్రజల మన్ననలు పొంది కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాం. ఇక మా ముందు మరో బాధ్యత ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయడమే. ఆ మేరకు అందరం కలిసి పనిచేయాలని నా భావన అని చెప్పారు.

 

సిద్ధ రామయ్యకు లైన్ క్లియర్ అయినట్లేనా ?

పలు దఫాలుగా సమాలోచనల అనంతరం సిద్ధ రామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా శివకుమార్ ఢిల్లీకి వెళ్లేందుకు ముందు చేసిన వ్యాఖ్యలను బట్టిచూస్తుంటే ఆ వార్తలు నిజమనే తెలుస్తోంది. సీఎం పదవిపై శివకుమార్ గట్టిగా పట్టుపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకవేళ శివకుమార్ ససేమీరా అంటే సిద్ధ రామయ్యకు రెండున్నరేళ్లు, శివకుమార్ కు రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వాలని ఢిల్లీ పార్టీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా శివకుమార్ వ్యాఖ్యలతో సిద్ద రామయ్య శిబిరంలో ఆనందం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధ రామయ్యకు సీఎం పదవి విషయంలో లైన్ క్లియర్ అయినట్లేనన్న వాదనను వారు వెలుబుచ్చుతున్నారు. సీఎంగా ఎవరిని ప్రకటిస్తే పార్టీకి ఇబ్బంది ఉండదనే విషయంపై  ఏఐసీసీ పరిశీలకులు తమ నివేదికను ఇప్పటికే ఖర్గేకు అందించారు. నేడు సోనియా, రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి పై ఖర్గే ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.