ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనా వైరస్ తో మృతి చెందారు. జార్ఖండ్‌లోని ధన్బాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాట్రాస్‌లోని ఒక కుటుంబానికి చెందిన 88 ఏళ్ల మహిళ ఢిల్లీలో జరిగిన వివాహానికి హాజరై ధన్బాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం ఆమె అనారోగ్యానికి గురై బొకారోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ (జూలై 4, 2020) మృతి చెందారు.
ఐదుగురు కుమారులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. అనంతరం 50 నుంచి 60 ఏండ్ల వయసున్న ఐదుగురు కుమారులకు కూడా కరోనా సోకింది. చికిత్స పొందుతున్న వీరంతా ఇటీవల వరుసగా మృతి చెందారు. ఆ కుటుంబంలోని మరో ఇద్దరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. మరోవైపు ఆ కుటుంబ సభ్యులను కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,500 దాటగా 49 మంది చనిపోయారు.