Parliament Session : విదేశాలకు వెళ్లిన సోనియా, రాహుల్..కారణమేంటో

  • Publish Date - September 13, 2020 / 07:12 AM IST

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. 2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం సాయంత్రం ఆమె విదేశాలకు బయలుదేరి వెళ్లారు. ఆరోగ్య పరీక్షల కోసం ఆమె వెళ్లినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా తెలిపారు. సోనియాతోపాటు… రాహుల్‌గాంధీ కూడా విదేశాలకు బయలుదేరి వెళ్లారు.



2020. సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వర్షాకాల సమావేశాలకు సోనియగాంధీ మాత్రం గైర్హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రాహుల్‌ గాంధీ మాత్రం ఈ వారంలో తిరిగి భారత్‌కు రానున్నారు. ఇండియా వచ్చిన తర్వాత ఆయన పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటారు.



గత కొద్ది సంవత్సరాలుగా సోనియగాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె జులై 30న ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. సాధారణ పరీక్షలు చేయించుకుని… కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.



ప్రతి ఏటా ఆమె ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఆమె విదేశాలకు వెళ్లారు. రెండు వారాలపాటు ఆమె విదేశాల్లోనే ఉంటారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత తిరిగి ఇండియాకు తిరిగి వస్తారు.