ఏ ప్రశ్నాపత్రం లీకవుతుందో తెలియదు, ఏ పరీక్ష రద్దు చేస్తారో తెలియదు.. విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం

వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడయితే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని హెచ్చరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేసేందుకు మాత్రం నిరాకరించింది.

Exam Paper Leaks : భారతదేశంలో పరీక్ష రాయడమే పరీక్షగా మారిన పరిస్థితి నెలకొంది. నీట్, నెట్, ఇంటర్, ఎంసెట్, గ్రూప్స్ ఇలా…. పరీక్ష ఏదైనా ప్రతి ప్రశ్నాపత్రమూ లీకవుతుంది. జాతిని నిర్మించే వారిని ఎంపిక చేసే పరీక్షల వ్యవహారం మొత్తం పైన పటారం.. లోన లొటారం అన్నట్లుగా మారింది.. హమ్మయ్య పరీక్ష రాసొచ్చాం, ఫలితాల కోసం ఎదురుచూస్తే చాలు అనుకునే పరిస్థితి లేదు..

పరీక్ష కోసం ఏడాదంతా విద్యార్థులు పడిన శ్రమ, తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడ్డ అష్టకష్టాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఏ ప్రశ్నాపత్రం లీకవుతుందో తెలియదు. ఏ పరీక్ష రద్దు చేస్తారో తెలియదు. మొత్తంగా అసలు విద్యార్థుల భవిష్యత్ ఏమిటో అర్ధం కాదు. అంతా అగమ్యగోచరం.

పరీక్ష ముందురోజు రాత్రే నీట్ ప్రశ్నాపత్రం లీక్..
పరీక్ష ముందురోజు రాత్రే నీట్ ప్రశ్నాపత్రం మా చేతికి అందింది. బీహార్‌లో నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యహారంలో పోలీసులు అరెస్టు చేసిన బీహార్ విద్యార్థులు చెప్పిన మాట ఇది. నోటితో చెప్పడమే కాదు.. లిఖితపూర్వంగా ఈ విషయాన్ని ఓ విద్యార్థి పోలీసుల ముందు అంగీకరించాడు. నీట్‌పై దేశంలో చెలరేగుతున్న దుమారంలో ఇదో ఘటన మాత్రమే. మే 5న నీట్ పరీక్ష జరిగిన దగ్గరి నుంచి ప్రశ్నాపత్రం లీకులపై ఆరోపణలు వస్తున్నాయి.

అయితే కేంద్రం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. బీహార్ విద్యార్థుల అరెస్టుపై కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంధ్రప్రధాన్ స్పందించారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తెలిపారు. దోషులెవరైనా సరే వదిలిపెట్టబోమని, చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నీట్‌ నిర్వహణపై కొన్నేళ్లగా తీవ్రస్థాయిలో ఆరోపణలు..
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలలో అండర్ గ్రాడ్యుడేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష నీట్. డాక్టర్ కావాలనుకునే ప్రతిఒక్కరూ నీట్ రాయాల్సిందే. ఈ పరీక్ష ఏటా నిర్వహిస్తారు. వైద్యవిద్యలో ప్రవేశం కోసం 2017 నుంచి నీట్ తప్పనిసరి చేశారు. అయితే నీట్‌ నిర్వహణపై కొన్నేళ్లగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులో నీట్‌కు వ్యతిరేకంగా ఉద్యమమే జరుగుతోంది. నీట్ వల్ల జాతీయస్థాయిలో తమిళనాడుకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తోంది.

ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కేంద్రం మాత్రం నీట్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఏటా నీట్‌లో ఉత్తీర్ణులై లక్షల సంఖ్యలో వైద్య విద్యార్థులు మెడికల్ కాలేజీలో సీట్లు పొందుతున్నారు. ఈ ఏడాది మే 5న జరిగిన నీట్‌ను 24లక్షల మంది రాశారు. ఈ నెల 4 ఫలితాలు విడుదలయ్యాయి.

100కు 100 మార్కులు రావడంతో అనేక అనుమానాలు..
పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల్లో సమయం కోల్పోవడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని 1,563మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. కొందరు విద్యార్థులు వందకు వందశాతం మార్కులు సాధించారు. దీంతో నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీకయిందని ఆరోపణలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఇది హాట్‌టాపిక్‌గా మారింది. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ, కౌన్సెలింగ్ నిలిపివేయాలంటూ హైకోర్టులు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్ విచారణ సమయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలి..
0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని జాతీయ పరీక్షా మండలిని ఆదేశించింది. ప్రశ్నపత్రం లీకేజీ, ఇతరత్రా అక్రమాలు జరిగాయని, ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, NTAను ఆదేశించింది. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడయితే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని హెచ్చరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేసేందుకు మాత్రం నిరాకరించింది.

ఇలాంటి అక్రమాలు పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీస్తాయి..
నీట్‌ నిర్వహణలో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. బీహార్, హర్యానా, గుజరాత్‌లో అరెస్టులు జరిగాయి. బీహార్ విద్యార్థులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. పరీక్ష ముందురోజు తమకు ప్రశ్నాపత్రం అందిందని, ఆ పేపర్, పరీక్షలో ఉన్న ప్రశ్నాపత్రం ఒకటేనని విద్యార్థులు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనల జరిపింది. ఇలాంటి అక్రమాలు పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

Also Read : రుషికొండపై విలాసవంతమైన భవనాలు.. వైసీపీ నేతలు ఎందుకు రహస్యంగా ఉంచారు? ప్రచారం చేసుకోకపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్ వార్తలు