PM Modi Friendship : కౌగిలింత.. శాంతిమంత్ర.. అందరి బంధువయ.. ద్వైపాక్షిక సంబంధాలు

PM Modi Friendship : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమైన వేళ... మోదీ రెండు దేశాల్లో పర్యటించారు.  గత నెల రష్యా వెళ్లారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు.

Special Focus on PM Modi Friendship with other Countries

PM Modi Friendship : అమెరికా మనదే.. రష్యా మనదే… యుక్రెయిన్‌ మనదే… ఏ దేశమైనా సరే… మనకు మిత్రుడే. ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరిగినా…. ద్వేషాలతో రగిలిపోయినా… మనం మాత్రం అందరి బంధువులమే. ప్రస్తుతం మోదీ వ్యవహరిస్తున్న తీరు ఇలానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించిన తర్వాత వరుస విదేశీ పర్యటనలు చేపడుతున్న మోదీ…. అందరితోనూ ద్వైపాక్షిక సంబంధాలు బలపరుస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా సరే…మెుదట అక్కడి అధ్యక్షులకు అప్యాయమైన కౌగిలింతను ఇచ్చి కూల్‌ చేస్తున్నారు.

రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమైన వేళ… మోదీ రెండు దేశాల్లో పర్యటించారు.  గత నెల రష్యా వెళ్లారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు. యుద్దభూమిలో ఎటువంటి పరిష్కారం దొరకదని చర్చలు జరపాలని కోరారు. చర్చల ద్వారానే శాంతికి మార్గాన్ని వెతుక్కోవాలని సూచించారు. పుతిన్‌ను కౌగిలించుకొని రెండు దేశాల మధ్య స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు. పుతిన్, మోదీ ఆలింగనంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లల ఆస్పత్రి దాడి చేసిన నేరస్థుడిని కౌగిలించుకోవడం శాంతి నెలకోల్పడానికి ప్రయత్నిస్తున్న వారికి నిరాశ కలిగించిందన్నారు. మోదీ రష్యా పర్యటనపై అమెరికా కూడా పెదవివిరిచింది.

భారత్‌కు జెలెన్‌స్కీని ఆహ్వానించిన మోదీ :
ఇక యుక్రెయిన్‌ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పలకరించిన తీరుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. జెలెన్‌ స్కీని ప్రేమతో పలకరించిన మోదీ…. ఆయనకు హగ్‌ ఇచ్చారు. ఆయన భుజంపై చేయి వేసి మాట్లాడారు. అనంతరం భారత్‌, యుక్రెయిన్‌ మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. యుక్రెయిన్‌లో శాంతి, సుస్థిరత నెలకొనాలని ఆకాంక్షించారు. సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలికేలా పరిష్కార మార్గాలు వెతకాలని సూచించారు. యుక్రెయిన్‌లో శాంతి కోసం అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. భారత్‌లో పర్యటించాలని జెలెన్‌స్కీని మోదీ ఆహ్వానించారు.

భారత్‌ మద్దతు తమకు చాలా అవసరమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అన్నారు. తమ దేశ జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భారత్‌ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. భారత్‌ మద్దతును తాము అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నామని చెప్పారు. ఒక కొత్త చరిత్ర నమోదైందని పేర్కొన్నారు జెలెన్‌ స్కీ. ప్రధాని మోదీ యుక్రెయిన్‌ పర్యటనపై వైట్‌హౌస్‌ స్పందించింది. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ఇది ఎంతో ముఖ్యమైనదని ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది. ఈ పర్యటన ద్వారా రష్యా, ఉక్రెయిన్‌ సంఘర్షణకు ముగింపు పలికినట్లయితే.. అది బాగా ఉపయోకరంగా ఉంటుందని భావిస్తున్నామని వెల్లడించింది.

ఒక భారత ప్రధాని యుక్రెయిన్‌లో 30 ఏళ్ల తర్వాత మెుదటిసారి పర్యటించారు. యుద్ధం కొనసాగుతున్న వేళ… మోదీ పర్యటనపై రష్యా అంత సంతోషంగా లేదనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటనతోనూ భారత్ అంత సంతోషంగా లేదనే అభిప్రాయం ఉంది. గతంలోనూ చాలా మందిని మోదీ ఆలింగనం చేసుకున్నారు. బరాక్‌ ఒబామా నుంచి ఇప్పటి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వరకు అందరికీ హగ్‌ ఇచ్చారు. బరాక్‌ ఒబామాను హత్తుకున్నప్పుడు పెద్ద చర్చే జరిగింది. దీన్ని అస్సలు ఊహించలేదని ఒబామా అన్నట్లు అమెరికా పత్రికలు కథనాలు వెలువరించాయి. జపాన్‌ ప్రధాని శింజో అబే, UAE రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ హగ్‌ లిస్ట్‌లో చాలామంది ఉన్నారు.

ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయని ఆలోచించకుండా…. ప్రపంచదేశాలు ఎలా రియాక్ట్‌ అవుతాయని పట్టించుకోకుండా మోదీ దేశాధ్యక్షులు, ప్రధానులతో వ్యవహరిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గూగుల్‌లో మోదీ హగ్గింగ్‌ అని సెర్చ్‌ చేస్తే దాదాపు 3 లక్షల రిజల్ట్స్‌ వచ్చాయంటే ప్రధాని కౌగిలింతకు ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. మోదీ హగ్‌ వెనుక చాలా విషయాలు దాగున్నాయని అభిప్రాయపడుతున్నారు. కొన్ని కోట్ల మంది భారతీయులను తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాననే అర్థం తీసుకురావడంతో పాటు.. తనను ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయనే మెసేజ్‌ను దేశానికి మోదీ ఇవ్వాలనుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు తాము ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోబోమని… అందరితోనూ స్నేహ సంబంధాలు కొనసాగిస్తామనే విషయాన్ని మోదీ చెబుతున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ కౌగిలింతలు ఇలాగే కొనసాగనున్నాయి. అన్ని దేశాలతో బంధం బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

Read Also : Russia-Ukraine Conflict : అందరితో భారత్ స్నేహగీతం.. చైనా, పాకిస్తాన్‌కు చెక్ పెట్టే ప్లాన్..!

ట్రెండింగ్ వార్తలు