Mumbai Boat Incident (Photo Credit : Google)
Mumbai Boat Incident : ముంబై బోటు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. 13 మంది చనిపోయారు. గేట్ ఆఫ్ ఇండియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సముద్రంలో పర్యాటకుల బోటును (ఫెర్రీ) స్పీడ్ బోటు ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు.
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బోటులో 85 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్ కమల్ అనే ఫెర్రీ 80 మంది పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా దూసుకొచ్చిన చిన్న స్పీడ్ బోటు.. ఫెర్రీని బలంగా ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ బోల్తా పడింది. వెంటనే స్పందించిన రెస్క్యూ బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, 4 హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. పోర్టు అధికారులు, కోస్ట్ గార్డ్స్, మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొని 75మందిని కాపాడారు.
బోటు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద ఘటనపై ఆయన ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన స్పీడ్ బోటు.. నేవీ లేదా కోస్ట్ గార్డ్ కు చెందినదిగా భావిస్తున్నారు. నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చి ఫెర్రీని ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా.. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.