ప్రధానమంత్రి మోడీ సెక్యురిటీ కోసం రూ. 600కోట్లు

  • Publish Date - February 1, 2020 / 10:46 PM IST

భారత ప్రధాని మోడీ సెక్యురిటీ కోసం బడ్జెట్లో నిధులను భారీగా పెంచింది కేంద్రం. ప్రత్యేక రక్షణ బృందా నికి (ఎస్పీజీ) కేంద్ర బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించారు. ప్రధాని భద్రతకు 2018-19లో రూ.420 కోట్లు కేటాయించగా, 2019-20 బడ్జెట్‌లో దాన్ని రూ.540 కోట్లకు పెంచారు. ఈసారి మరో రూ.60 కోట్లు పెంచుతూ రూ.600 కోట్లు కేటాయించారు.

భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా 3వేల మంది ప్రత్యేక భద్రతా సిబ్బందితో రక్షణ పొందుతున్నారు. గతేడాది నవంబర్‌లో గాంధీ కుటుంబసభ్యులకు  ఎస్పీజీ భద్రతను తీసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు గత నవంబర్‌లో ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు. అంతుకుముందు మాజీ ప్రధానులు వీపీసింగ్‌, దేవేగౌడకు కూడా ఎస్పీజీని ఉపసంహరించారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణం అనంతరం ప్రధానమంత్రుల రక్షణ కోసం 1985లో ఎస్పీజీ భద్రతను ఏర్పాటుచేసింది కేంద్రం. అనంతరం 1991లో రాజీవ్‌గాంధీ హత్యతో ఎస్పీజీ భద్రత ప్రధానుల కుటుంబానికి సైతం వర్తించేలా మార్పులు జరిగాయి.