బడాబాబుల బాగోతం: కళ్లద్దాలు, లిప్‌స్టిక్‌ల్లో సీక్రెట్ కెమెరాలు

సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్, భోపాల్‌లలో వలపు వల..బ్లాక్‌మెయిలింగ్ స్కాముల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీ ట్రాప్ స్కామ్ లో కొత్త కొత్త అంశాలు వెల్లడవుతున్నాయి. అమ్మాయిలతో వల వేసి..వారి ట్రాప్ లో చిక్కిన ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనల్లో టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
ఇండోర్, భోపాల్ హనీ ట్రాప్ స్కామ్ లో లిప్‌స్టిక్‌ల్లో, కళ్లద్దాల్లో సీక్రెట్ కెమెరాలతో ప్రముఖుల రాసలీలలను చిత్రీకరించారని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి పలు స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రముఖ నేతలతో పాటు మాజీ సీఎం కూడా ఈ హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. ఈ ట్రాప్ లో చిక్కిన ఆయన ఓ యువతితో హోటల్ రూమ్ లో గడిపిన దృశ్యాలను లిప్ స్టిక్, గాగుల్స్ వంటి వాటిలో అమర్చి రికార్డ్ చేసి..అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేస్తు కోట్లాది రూపాయలకు ముంచేస్తున్న వైనం బైటపడింది.
ఓ హిందూత్వ సంస్థకు చెందిన నాయకుడికి సన్నిహితుడైన ఓ పెద్దాయనకు సంబంధించిన మరో వీడియో కూడా బయటపడింది. ఈ హనీ ట్రాప్ కు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాకపోతే..ఇవి నిజమైనవా? కావాలని క్రియేట్ చేసినవా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.
ప్రముఖులతో యువతులు గడుపుతున్న సమయంలో లిప్‌స్టిక్‌ల్లో, కళ్లద్దాల్లో సీక్రెట్ కెమెరాలతో షూట్ చేసి ఈ వీడియోను చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేసి..వారితో పనులు చేయించుకునేవారు. ఈ హనీ ట్రాప్ లో ఇరుక్కున్న ఓ సీనియర్ ఇంజినీర్ ఈ వేధింపులు భరించలేదక పోలీసులకు కంప్లైంట్ చేయటంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఆర్తి దయాల్, మోనిక యాదవ్, శ్వేత విజయ్ జైన్, శ్వేత స్వప్నిల్ జైన్, బర్ఖా సోని, ఓం ప్రకాశ్ కోరిలను సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ మంత్రులకు సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్‌లను సిట్ స్వాధీనం చేసుకుంది.