ఒకవైపు రాకెట్ రోధసీలోకి రయ్ మంటూ దూసుకెళ్తోంది. అభివృద్ధి చెందుతున్నామని సంబరపడిపోతున్నాము. మరోవైపు గ్రామాల్లో పెద్దమనుషుల రచ్చబండ తీర్పులు రచ్చ చేస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లో ఓ వివాహిత మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో వింత తీర్పునిచ్చారు. భర్తను భుజాలపై ఎత్తుకుని ఊరంతా తిప్పాలని ఆల్టిమేటం జారీ చేశారు. వింత శిక్షతో విస్తుపోయిన భార్య..చేసేదేమీ లేక భర్తను భుజాలపై ఎత్తుకుని ఊరంతా తిరిగింది.
ఝుబ్వాలో జరిగిన ఈ ఘటన సభ్యసమాజాన్ని షాక్ కు గురిచేసింది. భర్తను భుజంపై ఎత్తుకుని ఆమె చాలా దూరం నడిచింది. ఆమె భర్తను ఎత్తుకుని వెళ్తున్న సమయంలో పక్కనున్నవాళ్లంతా ఆమెను తిట్టిపోశారు. అంతటితో ఆగకుండా కర్రలతో కాళ్లపై కొడుతూ పైశాచిక ఆనందం పొందారు.
కొంతమంది డ్యాన్స్ లు చేస్తూ వికృతానందం పొందారు. ఓ వైపు దెబ్బలు..మరోవైపు భర్తను ఎత్తుకున్న భారంతో బాధిత మహిళ తీవ్ర ఇబ్బంది పడింది. అయినా గ్రామస్తులు కనికరించలేదు. తప్పు చేశావంటూ సూటిపోటి మాటలతో హింసించారు.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తప్పు చేస్తే కౌన్సిల్ ఇచ్చి సరిగ్గా ఉండాలని సలహా ఇవ్వాలే తప్ప అనాగరిక చర్యలకు పాల్పడతారా అని మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఝబ్వా గ్రామస్తులపై చర్యలు డిమాండ్ చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.