Delhi
Strict measures for corona control : ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1558 కేసులు నమోదవ్వగా, 10 మంది మృతి చెందారు. రంగంలోకి దిగిన ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. వివాహాలు, శుభకార్యాలు, అంత్యక్రియలకు హాజరయ్యే సంఖ్యపై పరిమితి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశంలో వివాహ వేడుకకు హాజరయ్యే వారి సంఖ్య 200కు తగ్గించింది. క్లోజ్ స్పేస్ సమావేశాలకు 100 మందికి మాత్రమే అనుమతులిచ్చింది. అంత్యక్రియల కార్యక్రమానికి 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 30 వరకు అమలులో ఉండనున్నట్లు స్పష్టం చేసింది.
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. వారం రోజులుగా ప్రతిరోజు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 62 వేల 714 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 312 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. 28 వేల 739 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా ఇప్పటికీ 4 లక్షల 86 వేల 310 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 6 కోట్ల 2 లక్షల 69 వేల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. 165 రోజుల తరువాత కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదయ్యాయి. 24 గంటల్లో నమోదైన మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే సగానికి పైగా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 166 మంది మృతి చెందారు.
ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోనే 35 వేల 726 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. హొలీ వేడుకలను బహిరంగ ప్రాంతాల్లో రద్దు చేస్తూ మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, యూపీ, బీహార్, ఒడిశా, చండీఘడ్ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. మధ్యప్రదేశ్‌లో 12 నగరాల్లో ఇవాళ్టి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.