పంట వ్యర్థాల దహనం…ఏకసభ్య కమిటీ రద్దు చేసిన సుప్రీం

Stubble burning: Supreme Court Agrees To Request After Centre Assures Law పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా ఢిల్లీ,దానిపరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నివారణకు చర్యలు చేపట్టేలా ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని రద్దు చేస్తున్నట్లు ఇవాళ(అక్టోబర్-26,2020) సుప్రీంకోర్టు ప్రకటించింది.



పొల్యూషన్ ని అరికట్టడానికి కేంద్రం సమర్థమైన చట్టం తీసుకురానుందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ‘కాలుష్యం కారణంగా దేశరాజధాని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని… ఇది తక్షణమే నివారించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది. కాలుష్య నివారణకు కేంద్రం సమర్థమైన చర్యలు తీసుకుంటోందని… దానికి సంబంధించి ప్రతిపాదిత డ్రాఫ్ట్​ను నాలుగు రోజుల్లో కోర్టు సమర్పిస్తామని సొలిసిటర్​ జనరల్​ కోర్టుకు విన్నవించారు.



కాగా, ఈ నెల 16న హర్యానా,పంజాబ్,యూపీలో పంట పంట వ్యర్థాల దహనం నివారణకు చర్యలు చేపట్టేలా రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బీ లోకూర్​తో కూడిన ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలగాలని కమిటీని నియమిస్తూ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. పంట వ్యర్థాలు దహనం జరిగే పొలాల్లో ప్రత్యక్ష తనిఖీ సమయంలో ఈ కమిటీకి కావాల్సిన సహకారం అందించాలని మూడు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు, పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ(EPCA)కి ఎస్ ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.



వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు కమిటీకి సహాయపడేందుకు ఎన్‌సీసీ(National Cadet Corps), ఎన్‌ఎస్ఎస్(National Service Scheme),భారత్ స్కౌట్స్ బృందాల వినియోగం కూడా సరైనదేనని ఆ సమయంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 15 రోజులకోసారి కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక అందించాలని సూచించింది. కాగా, అప్పుడే కమిటీ ఏర్పాటుపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం తరపున కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపిన అభ్యంతరాలను కోర్టు అప్పుడు తోసిపుచ్చింది. ఇక ఇప్పుడు పొల్యూషన్ పై సమర్థమైన చట్టం తీసుకురానున్నట్లు కేంద్రం హామీ ఇవ్వడంతో ఆ ఏకసభ్య కమిటీని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.