Sukhbir Badal slams CM Mann for allegedly being drunk and deplaned from flight
Sukhbir Singh Badal: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌పై తాగుబోతు ఆరోపణలు గతంలో తీవ్రంగా ఉండేవి. తాగి పార్లమెంట్‌కు వచ్చారని, సరిగా నిల్చోలేకపోయారని, మాట్లాడలేకపోయారంటూ అనేకమైన విమర్శలు గతంలో అనేకం ఉన్నాయి. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను తాగుడు పూర్తిగా మానేశానని, ఇకపై తాగబోనని మాన్ పబ్లిక్ మీటింగులో ప్రకటించారు.
ఈ వాగ్దానం చేసిన ఆరు నెలల తర్వాత మరోసారి ఆయనపై తాగుబోతు ఆరోపణలు ఊపందుకున్నాయి. తాజాగా మాన్ మద్యం మత్తులోనే విమానం ఎక్కారని, దీంతో ఆయనను విమానం దింపేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ అంశాన్ని తేవనెత్తుతూ ముఖ్యమంత్రి మాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పంజాబీలను అవమానపరుస్తున్నారని మండి పడ్డారు. జాతీయ గౌరవంతో ముడిపడి ఉన్నందుకు భారత ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకోవాలని బాదల్ డిమాండ్ చేశారు.
విమానంలో ఇండియాకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి తాగి వచ్చి సహ ప్రయాణికులను ఇబ్బందికి గురి చేశారంటూ వచ్చిన ఒక వార్తా కథనాన్ని విషయమై సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో బాదల్ షేర్ చేస్తూ ‘‘నడవడానికి కూడా ఓపిక లేకుండా తాగినందున లుఫ్తాన్సా విమానం నుంచి భగవంత్ మాన్‌ను దించేశారని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆ విమానం నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. అంతే కాకుండా ఆప్ జాతీయ సమావేశానికి కూడా మాన్ హాజరు కాలేకపోయారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పంజాబీలను తీవ్ర ఇబ్బంది పెడుతోంది, అవమానానికి గురి చేస్తోంది’’ అని రాసుకొచ్చారు.
ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘దిగ్భ్రాంతికరమైన మరో విషయం ఏంటంటే.. ముఖ్యమంత్రికి సంబంధించిన ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ స్పష్టత ఇవ్వాలి. ఇది పంజాబ్‌తో పాటు జాతీయ గౌరవానికి సంబంధించిన అంశం. భారత ప్రభుత్వం ఈ విషయంలో తప్పనిసరిగా కలుగజేసుకోవాలి. ముఖ్యమంత్రిని తొలగించాలి. అలాగే జర్మన్ కౌంటర్‌పార్ట్ సమస్యను లేవనెత్తాలి’’ అని మరో ట్వీట్ చేశారు.
World No-2: ప్రపంచ ధనవంతుల జాబితాలో మరోసారి 2వ స్థానానికి గౌతమ్ అదాని