×
Ad

Multiplexes Rates: వామ్మో.. కప్పు కాఫీ 700 రూపాయలా? వాటర్ బాటిల్ 100 రూపాయలా? సినిమా థియేటర్లలో ధరలపై సుప్రీంకోర్టు సీరియస్..

టికెట్ రేట్ల నుంచి తినే వస్తువుల వరకు మల్టీప్లెక్స్‌‌లో ధరలు చుక్కలను తాకుతున్నాయి.

Multiplexes Rates: సినిమా థియేటర్స్ లో ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలియంది కాదు. సామాన్యులు, మధ్య తరగతి వారు సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్న అభిప్రాయం నెలకొంది. టికెట్ ధర మొదలుకుని తినే వస్తువల వరకు ధర మోత మోగిపోతోంది. దీంతో సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటేనే భయపడిపోయే పరిస్థితులు తయారయ్యాయి.

తాజాగా థియేటర్లలో ధరల పోటుపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వామ్మో.. ఇవేం ధరలు అని విస్మయం వ్యక్తం చేసింది. టికెట్ ధరలతో పాటు థియేటర్లలో అమ్మే తినే వస్తువులపై పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఒక్క నీళ్ల బాటిల్‌కు 100 రూపాయలు, కప్పు కాఫీకి 700 రూపాయలు వసూలు చేస్తారా? అని మండిపడింది. టికెట్‌, తినుబండారాల ధరలు ప్రజలకు అందుబాటులో లేకపోతే థియేటర్లు ఖాళీ అవడం ఖాయమని అభిప్రాయపడింది.

టికెట్ రేట్ల నుంచి తినే వస్తువుల వరకు మల్టీప్లెక్స్‌‌లో ధరలు చుక్కలను తాకుతున్నాయి. మినిమం టికెట్ ధర 200 రూపాయల పైనే ఉంటోంది. ఒక వాటర్ బాటిల్ ధర 100 రూపాయలు.. కాఫీ ధర 700 రూపాయలు ఉంటోంది. ఈ ధరల పోటుతో సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు మల్టీప్లెక్స్‌లకు వెళ్లే పరిస్థితి కనిపించటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మల్టీప్లెక్స్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యధిక ధరలు ఇలానే కొనసాగితే సినిమా హాళ్లు మూసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.

ఈరోజుల్లో సాధారణ ప్రజలు ఒక సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్‌కు వెళితే 1,500 నుంచి 2వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మల్లీప్లెక్స్‌ థియేటర్లలో ధరలపై సుప్రీంకోర్టు సీరియస్ అవడానికి కారణం లేకపోలేదు. మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర 200 రూపాయలకు మించకూడదని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిపై కర్ణాటక మల్టీప్లెక్స్‌ థియేటర్ల ఓనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇలా అయితే.. సినిమా థియేటర్లు మూసుకోవాల్సిందే..!

ఈ సందర్భంగా మల్టీప్లెక్స్ లలో ధరలపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. టికెట్‌ తో పాటు తినే వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో లేకపోతే థియేటర్లు ఖాళీ అవడం ఖాయమని న్యాయస్థానం అభిప్రాయపడింది. టికెట్‌ ధర రూ.200 ఉండాలనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాన్ని తాము సమర్థిస్తున్నామని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ తెలిపారు. జనం వచ్చి సినిమా చూసి ఆనందించేలా ధరలు ఉండాలి, లేకపోతే సినిమా హాళ్లు ఖాళీగా ఉండాల్సి వస్తుందన్నారు.

ప్రస్తుతం సినిమా హాళ్లలో పాప్ కార్న్ ధరే 500 రూపాయల వరకు ఉంటోంది. బయట 50 రూపాయలకు దొరికే కూల్ డ్రింక్ రేటు.. థియేటర్స్ లో 400 రూపాయలుగా ఉంటోంది. అర లీటర్ వాటల్ బాటిల్ ధర 100 రూపాయలుగా ఉంది. ఇలా సినిమా చూసి రావాలంటే.. సుమారు 400 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.