Supreme Court Comments : జార్ఖండ్ జడ్జి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సుప్రీం సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Jharkhand judge’s murder case : జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సుప్రీం సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరచడం దురదృష్టకరమన్నారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదని తెలిపారు. ఇందుకు జార్ఖండ్ జడ్జి హత్యే ఒక ఉదాహరణ అని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. పూర్తి బాధ్యతతో వ్యాఖ్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక హత్య కేసుపై దర్యాప్తు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన దగ్గర ఉందని తెలిపారు. న్యాయమూర్తుల రక్షణపై కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయని, మిగతా రాష్ట్రాలు కూడా స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు.

జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ది అనుమానాస్పద మృతిగా, తరువాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు భావించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీకొట్టి హత్య చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు బార్ అసోసిసేషన్.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది.

ట్రెండింగ్ వార్తలు