ఖాకీ తీవ్రవాది,సస్పెండెడ్ జమ్మూకశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ కు టెర్రర్ కేసులో బెయిల్ మంజూరు అయింది. దవీందర్ సింగ్ తో పాటు మరో నిందితుడు ఇర్ఫాన్ షఫీ మీర్ కూడా శుక్రవారం ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇద్దరు వేర్వేరుగా రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు వారిని ఆదేశించింది. వీరిని అరెస్టు చేసి 90 రోజులు కావొస్తున్నప్పటికీ.. ఛార్జిషీటును సమర్పించడంలో విచారణ సంస్థ విఫలమైందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో ఇద్దరు ముజాహిద్దీన్ ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ దవీందర్ సింగ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో దక్షిణ కశ్మీర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అతుల్ గోయల్ నేతృత్వంలోని పోలీస్ బృందం.. డీఎస్పీతో పాటు ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఉగ్రవాదులతో పట్టుబడిన తర్వాత దవీందర్ సింగ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి, ఒక ఏకే 47 రైఫిల్, రెండు తుపాకులు, మూడు గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారని నిఘా వర్గాల తెలిపాయి. కాగా, దవీందర్ గతేడాది ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌ను అందుకోవడం విశేషం.