ప్రధాన నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ మిషన్ మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా 2వేల 3వందల నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు వెలిశాయి. జాతిపిత, మహాత్మాగాంధీ (అక్టోబర్ 2) గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ మేరకు కంపెనీ పబ్లిక్ టాయిలెట్లకు సంబంధించి సెర్చ్ డేటాను ప్రకటించింది.
గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్ లో పబ్లిక్ టాయిలెట్ల కోసం సెర్చ్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రతి నెలలో 2.5 లక్షల మందికి పైగా యూజర్లు పబ్లిక్ టాయిలెట్ల కోసం గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సహకారంతో 2016 లో న్యూఢిల్లీ, భోపాల్, ఇండోర్‌లో పైలట్‌గా ప్రారంభించి గూగుల్ మ్యాప్స్‌కు పబ్లిక్ టాయిలెట్లను జోడించారు.
అప్పటి నుంచి గూగుల్ సెర్చ్ లేదా గూగుల్ మ్యాప్స్ ద్వారా పబ్లిక్ టాయిలెట్లకు సంబంధించి సమాచారాన్ని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ లో పబ్లిక్ టాయిలెట్లు ఎక్కెడక్కడ ఉన్నాయో సులభంగా చెక్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ లేదా గూగుల్ మ్యాప్స్ ద్వారా వెంటనే తెలుసుకునే అవకాశం ఉందని సీనియర్ ప్రొగ్రామ్ మేనేజర్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ అనాల్ ఘోష్ తెలిపారు. స్వచ్చ భారత్ ప్రచారం కోసం ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి గూగుల్ మ్యాప్స్ లోకి పబ్లిక్ టాయిలెట్ల జాబితాను చేర్చేందుకు కొత్త ప్రక్రియను రూపొందించినట్టు ఘోష్ చెప్పారు.
గూగుల్ మ్యాప్స్ లో పబ్లిక్ టాయిలెట్లకు సంబంధించి వివరాలను పొందుపరిచేందుకు ప్రభుత్వానికి గూగుల్ మై బిజినెస్ ప్లాట్ ఫాం ఎంతో సహకరించిందని అన్నారు. 2018 ఏడాదిలో పబ్లిక్ టాయిలెట్లకు సంబంధించి అవగాహన కోసం గూగుల్ మ్యాప్స్ లో ప్రచారం చేయగా.. దేశవ్యాప్తంగా స్థానిక గైడ్స్ సాయంతో 32వేల రివ్యూలు, ఫొటోలు, కొత్త పబ్లిక్ టాయిలెట్ల సమాచారాన్ని సేకరించారు.