తక్కువ మాట్లాడి…ఎక్కువ పని చేయండి : ఆర్మీ చీఫ్ కు కాంగ్రెస్ హితవు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఆర్మీ చీఫ్ మాటలు తగ్గించి ఎక్కువ పని చేయాలని కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు.

శనివారం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ మాట్లాడుతూ…పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంట్ ఆదేశిస్తే ఆపరేషన్ పీఓకే నిర్వహించి భారత్ లో కలిపేసేందుకు సైన్యం సిధ్దంగా ఉందన్నారు. జమ్మూకశ్మీర్ భారత అంతర్భాగమని పార్లమెంట్ తీర్మానం చేసిందని.. ఒకవేళ పీఓకె కూడా మనకే చెందాలని భావిస్తే.. దానిపై పార్లమెంట్‌లో తీర్మానం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆ తీర్మానంపై తమకు ఆదేశాలు అందితే పీఓకెపై చర్యలకు రెడీ ఉన్నామని ఆయన చెప్పారు. భారత దేశం లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర దేశమని చెప్తున్న రాజ్యాంగ విలువలకు సైన్యం కట్టుబడి ఉంటుందని కూడా ఆయన చెప్పారు.

అయితే ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చేసిన ఓ ట్వీట్ లో…1994లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రస్తావించారు. జమ్మూ-కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమని, పాకిస్థాన్ ఆక్రమించిన ప్రాంతాల నుంచి తన దళాలను పాకిస్థాన్ ఉపసంహరించుకోవాలని ఈ తీర్మానం చెప్తోందని గుర్తు చేశారు. పీఓకేపై చర్య తీసుకోవాలనుకుంటే, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తోనూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనూ మాట్లాడాలని సలహా ఇచ్చారు. ఆర్మీ చీఫ్ మాటలు తగ్గించి, పని పెంచాలన్నారు.