డీఎంకే నేత ఏ.రాజాకి ఈసీ షాక్..ప్రచారంపై నిషేధం

మాజీ కేంద్రమంత్రి,డీఎంకే ఎంపీ ఏ.రాజాకి ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటలపాటు ఆయన ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

Tamil Nadu మాజీ కేంద్రమంత్రి,డీఎంకే ఎంపీ ఏ.రాజాకి ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటలపాటు ఆయన ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. డీఎంకే స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి రాజా పేరును కూడా ఈసీ తొలగించింది.

తమిళనాడు సీఎం, ఆయన తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తగిన సమాధానం ఇవ్వనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించనందుకు రాజాను మందలించిన ఈసీ..ప్రచార నిషేధ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

రాజా సీఎం తల్లిని ఏమన్నారు

కాగా,డీఎంకే ఎంపీ ఏ రాజా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ…డీఎంకేలో స్టాలిన్‌ జిల్లా కార్యదర్శి నుంచి అధ్యక్షుడి వరకు అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. దీని ద్వారా పెళ్లై 9 నెలల తర్వాత సరైన పద్ధతిలో స్టాలిన్‌ జన్మించారని చెప్పవచ్చన్నారు. అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన సీఎం పళనిస్వామి.. అకాల శిశువుగా జన్మించారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి పళనిస్వామి.. గ్రామీణ ప్రాంతంలో జీవనం సాగిస్తూ కన్నుమూసిన తన తల్లిని కించపరుస్తూ మాట్లాడుతున్నారని కంటతడి పెట్టారు. భగవంతుడు వారికి తగిన శిక్ష వేస్తాడని చెన్నైలోని తిరువత్తియూరులో ఎన్నికల ప్రచారం సమయంలో పళనిస్వామి ఉద్వేగభరితంగా మాట్లాడారు.

పళనిస్వామి తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలను ప్రధాని మోడీ కూడా తప్పుబట్టారు. సీఎం పళనిస్వామి తల్లిని అవమానించిన వారు అధికారంలోకి వస్తే మహిళలను గౌరవిస్తారా? అని ప్రధాని ప్రశ్నించారు. రాజాని ఉద్దేశించి ‘కాలం చెల్లిన 2జీ మిసైల్’​ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళ మహిళలే లక్ష్యంగా ఆ మిసైల్​ పని చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర మహిళలను అవమానిస్తే తమిళులు సహించరని అన్నారు.

క్షమాపణలు చెప్పిన రాజా

ఇక,తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి డీఎంకే ఎంపీ ఎ.రాజా క్షమాపణలు చెప్పారు. ఆయనను వ్యక్తిగతంగా కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. సీఎం పళనిస్వామి కంటతడి పెట్టడం బాధించిందని రాజా చెప్పారు. ఆయనను వ్యక్తిగతంగా దూషించడం తన ఉద్దేశం కాదని, ఇద్దరి రాజకీయ జీవితాల గురించి మాత్రమే పోల్చి మాట్లాడానని రాజా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు