Tamil Nadu BJP chief on Krishnamoorthy's remarks against Governor
TamilNadu: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిపై అధికార డీఎంకే నేతలు శివాజీ క్రిష్ణమూర్తి, ఆర్.ఎస్ భారతి చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు భారతీయ జనతా పార్టీ విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే ప్రతీదాన్ని రాజకీయం చేస్తోందని, రాజకీయాల్ని కలుషితం చేస్తోందని తమిళనాడు బీజేపీ చీఫ్ కే.అన్నామలై విమర్శించారు. డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై తమిళనాడు డీజీపీకీ అన్నామలై లేఖ లేశారు. డీఎంకే నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
తమిళనాడులో అధికార పార్టీకి గవర్నర్ ఆర్.ఎన్ రవికి మధ్య చెలరేగిన వివాదం సరికొత్త మలుపులతో మరింత వివాదాస్పదమవుతోంది. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ పూర్తిగా చదవలేదు. అంబేద్కర్, పెరియార్, అన్నాదురై వంటి పేర్లను తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించలేదు. అంతే కాకుండా తమిళనాడు పేరును ఉద్దేశపూర్వకంగానే తమిళగం అని ప్రస్తావించారు. దీనిపై సభలోనే గవర్నర్ రవికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ తీర్మానం చేశారు. అయితే ఈ వివాదం ఆరోజు నుంచి రగులుతూనే ఉంది.
Manish Sisodia: తన కార్యాలయంలో మళ్లీ సీబీఐ సోదా చేసిందన్న సిసోడియా.. అదేం లేదన్న సీబీఐ
తాజాగా అధికార పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నేతలు గవర్నర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో ‘అంబేద్కర్ పేరు పలుకని వారిని చెప్పుతో కొట్టే హక్కు లేదా?’ అంటూ ప్రశ్నించగా, మరొకరు ‘బిహార్ నుంచి వచ్చి పానీపూరి అమ్ముకునే వారికి తమిళనాడు ఆత్మగౌరవం తెలియదు’ అంటూ స్పందించారు. డీఎంకే నేతలు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. చెప్పుతో కొట్టే హక్కు లేదా అని వ్యాఖ్యానించిన నేతపై పోలీసు కేసు సైతం నమోదు అయింది.
శివాజీ రామకృష్ణన్, డీఎంకే నేత. గవర్నర్ వ్యాఖ్యలపై శుక్రవారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ ‘‘గవర్నర్‌ను తిట్టవద్దని సీఎం చెప్పారు. ఆయన (గవర్నర్) ప్రసంగాన్ని సరిగ్గా చదివి ఉంటే, నేను ఆయన పాదాల మీద పూలు చల్లి, చేతులు జోడించి నమస్కరించేవాడిని. అయితే అంబేద్కర్ పేరు చెప్పడానికి నిరాకరిస్తే చెప్పుతో కొట్టే హక్కు నాకు లేదా? మీరు అంబేద్కర్ పేరు చెప్పడానికి ఇష్టపడకపోతే కాశ్మీర్‌కు వెళ్లండి. మిమ్మల్ని (గవర్నర్) కాల్చి చంపడానికి మేము ఉగ్రవాదిని పంపుతాం’’ అని అన్నారు. ఈయన మీద భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 కింద కేసు నమోదు అయింది.
Amartya Sen: ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బెటర్.. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్
ఇక మరొక నేత ఆర్.ఎస్ భారతి గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ ‘‘చాలా మంది బిహార్ నుంచి వచ్చి ఇక్కడ పానిపూరీలు, సోన్ పాపిడి అమ్ముకుంటారు. వారికి తమిళనాడు గొప్పతనం అంటే ఏంటో తెలియదు. ఆయన (గవర్నర్) కూడా అదే రైలులో ఇక్కడికి వచ్చారు’’ అని అన్నారు. ఈ ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ తమిళనాడు విభాగం అయితే వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.