తెలంగాణకు రూ.10కోట్ల సాయం ప్రకటించిన తమిళనాడు సీఎం

Tamil Nadu CM announces flood relief for Telangana గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అతి భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో ప్రాణ నష్టంతోపాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. పలు ప్రాంతాలు ఇంకా జల దిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం(అక్టోబర్-19,2020) తెలంగాణకు రూ. 10 కోట్ల సాయం ప్రకటించారు.



తక్షణమే రూ. 10 కోట్ల రూపాయలను తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు బ్లాంకెట్స్, ఇతర రిలీఫ్ మెటీరియల్ పంపిచనున్నట్టు ఆయన చెప్పారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని పళనిస్వామి సృష్టం చేశారు.



తెలంగాణ ప్రభుత్వం కోరితే మరే ఇతర సహాయం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి రూ. 10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞత‌లు తెలిపారు.



సాయం చేసేందుకు ఎంతో ఉదారతతో ముందుకు వచ్చిన తమిళనాడు సీఎం పళనిస్వామికి, ఆ రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా కేసీఆర్ కృతజ్ఞత‌లు తెలియజేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చూపాలని కోరారు.



మరోవైపు,హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం(అక్టోబర్ 19,2020) సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారికి ఆర్థిక సాయం, నష్టపరిహారం ప్రకటించారు. వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.10వేలు ఇవ్వనున్నారు. వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిన వారికి రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు సాయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే దెబ్బతిన్న రోడ్లు, ఇతర మౌలిక వసతులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు రేపటి(అక్టోబర్ 20,2020) నుంచే నష్టపరిహారం అందించాలని కేసీఆర్ ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు