Tamil Nadu Lockdown Cant Keep Extending Lockdown Says Cm Stalin
Tamil Nadu Lockdown Extending Lockdown: తమిళనాడులో కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ దీర్ఘకాలం కొనసాగించలేమని ఆ రాష్ట్ర సీఎం ఎంకె స్టాలిన్ అన్నారు. అన్ని విధాలుగా కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి పూర్తి లాక్‌డౌన్ మాత్రమే ఏకైక మార్గమని చెప్పారు. అలా అనీ, లాక్‌డౌన్ ఎక్కువ కాలం పొడిగించలేమన్నారు. రాష్ట్రంలోని ప్రజల జీవనోపాధిపై ఆందోళనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ మళ్లీ మళ్లీ పొడిగించలేమని, ప్రజల సహకారం చాలా అవసరమని స్టాలిన్ అన్నారు.
లాక్‌డౌన్ ఎత్తివేసే అంశం ప్రజల చేతుల్లో ఉందని స్టాలిన్ చెప్పారు. చెన్నైలో రోజుకు 7వేల కరోనా కొత్త కేసులు నమోదవుతుండగా.. ఇప్పుడు 2 వేలకు తగ్గాయని చెప్పారు. కొద్ది రోజుల్లోనే అది పూర్తిస్థాయిలో తగ్గిపోతుందని ఆశిస్తున్నామని సీఎం చెప్పారు. కోయంబత్తూర్‌తో సహా పశ్చిమ మండలంలో గత వారంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అయితే గత రెండు రోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గడం ప్రారంభమైంది. రాష్ట్రంలో పూర్తి లాక్డౌన్ ఫలితంగా కేసులు తగ్గుముఖం పట్టినట్టు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో పడకలు, వైద్య ఆక్సిజన్ కొరతను తీర్చడానికి ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలను స్టాలిన్ వివరించారు. చాలా ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నాయని, రోజుకు మూడు లక్షల మందికి టీకాలు వేస్తున్నామని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రం కూడా ఇంత వేగంగా టీకాలు వేయడం లేదన్నారు. రోజుకు సుమారు 1.70 లక్షల శాంపిల్స్ పరీక్షిస్తున్నారు. మరే ఇతర రాష్ట్రం రోజుకు ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం లేదని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని బ్రేక్ చేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
మొదటి వేవ్ పూర్తి లాక్ డౌన్ చేయడంలో విఫలమైనందున రెండో వేవ్ ఎదుర్కొంటున్నామని అన్నారు. ప్రస్తుత కొవిడ్ సంక్షోభం నుంచి బయటకు వచ్చాక వివిధ విభాగాలలో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం అన్నారు. మే 10 నుంచి తమిళనాడులో ఆంక్షలపై సడలింపులు ఎత్తివేయగా.. మే 24 నుంచి పూర్తి లాక్ డౌన్ అమలు అవుతోంది. జూన్ 7 వరకు ఈ లాక్ డౌన్ అమలులో ఉంటుంది.