Tamil Nadu Road Accident Dmk Mp Son Death
Tamil Nadu Road Accident DMK MP Son Death : తమిళనాడుకు చెందిన రాజ్యసభ ఎంపీ, డీఎంకే రాజకీయ నాయకుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. గురువారం (మార్చి 10,2022) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజకం) పార్టీకి చెందిన ఎంపీ కుమారుడు 22 ఏళ్ల రాకేష్ రంగనాథన్ ప్రాణాలు కోల్పోయారు.
డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్‌ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేష్ పుదుచ్చేరి నుంచి చెన్నై కారులో వెళ్తుండగా..విల్లుపురం జిల్లాలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందారు. అతనితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.
మాజీ సీనియర్ న్యాయవాది ఇళంగోవన్ 2020 నుంచి డీఎంకే పార్టీ తరఫున రాజ్యసభలో తమిళనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేష్ మరణవార్త తెలియడంతో సీఎం స్టాలిన్ సహా, పలువురు పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా..ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని కీజ్‌పుతుపట్టు గ్రామం వద్ద ఆవును ఢీకొట్టకుండా తప్పించే యత్నంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
విల్లుపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా సరిహద్దులోని కొత్తకుప్పం సమీపంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని కీజ్‌పుతుపట్టు గ్రామం వద్ద టిఎన్-02-సిసి-1000 రిజిస్ట్రేషన్ నంబర్ గల వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. “వాహనం అతి వేగంతో వస్తుండగా, ఒక ఆవు అకస్మాత్తుగా రోడ్డు దాటింది. కారు ఆవును కొట్టకుండా తప్పించే యత్నంలో బ్యాలెన్స్ కోల్పోయి డివైటర్ ను ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగిందని ”అని విల్లుపురం జిల్లా పోలీసులు వెల్లడించారు.