మోడీ, అమిత్ షాలను తిట్టిన రచయిత అరెస్ట్

  • Publish Date - January 2, 2020 / 04:26 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా మాట్లాడిన రచయితను అరెస్ట్ చేశారు పోలీసులు. పౌర నిరసనలో భాగంగా వారిపై తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత, రచయిత నెల్లై కన్నన్‌ పేల్చిన మాటల తూటాలు పెను వివాదాలకు దారి తియ్యగా.. ఆయనను అరెస్టు చేయాలని పట్టుబడుతూ, మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర నేతలు బైఠాయించారు.

ఈ క్రమంలోనే ఇవాళ(02 జనవరి 2020) ఉదయం నెల్లై కన్నన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోడీ, షాలను దూషించినందుకు అతనిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు పోలీసులు. కన్నన్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 505(1), 505(2) వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. పౌరహక్కు చట్టం సవరణను ఖండిస్తూ తమిళనాడు వ్యాప్తంగా విపక్షాలు పెద్ద ఎత్తున  నిరసనలు చేస్తున్నాయి. ఈ ర్యాలీ సందర్భంగా మోడీ, షాలను దూషిస్తూ నెల్లై కన్నన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని ఖండిస్తూ తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ ధర్నాలకు దిగగా.. పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు బీజేపీ నేతలు. దీంతో నెల్లై కన్నన్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు.

అయితే నెల్లై కన్నన్‌ను వెంటనే అరెస్టు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా.. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయనను ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.