చోరీ కోసం వెళ్లి చేపల పులుసు తిని నిద్రపోయాడు..ఆ తరువాత ఏం జరిగిందంటే..

  • Publish Date - June 17, 2020 / 06:20 AM IST

దొంగతనానికి వెళ్లిన వాడు పని చక్కబెట్టుకుని రాకుండా కక్కుర్తి పడిన దొంగ అడ్డంగా బుక్ అయిపోయాడు. జనాల చేతికి దొరికి తన్నులు తిన్నాడు ఓ దొంగ.మరి ఈ దొంగ తిండరోడో..లేక కక్కుర్తి బాగా ఉన్నవాడో చూద్దాం..

ఆ దొంగకు బాగా ఆకలి వేసిందో ఏమో.. ఫుల్‌గా తినేసి వెళ్లిన పని మరిచిపోయాడు. నిద్ర ముంచుకు రావడంతో ఆ ఇంట్లోనే నిద్రపోయాడు. చివరికి జనాలకు చిక్కి.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో సతీస్ అనే యువకుడు ఓ ఇంట్లో దొంగతనం చేయటానికి వచ్చాడు. ఏమేమీ నొక్కేద్దామా అనుకుంటూ ఇల్లంతా కలియతిరిగాడు. బంగారంగానీ..విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. ఎందుకొచ్చాన్రా బాబూ..నా టైమ్ అంతా వేస్ట్ అయ్యిందని డీలా పడపోతున్న క్రమంలో వంటింట్లోంచి ఘుమఘుమలాడే చేపల పులుసు కూర వాసన వచ్చింది. పాపం..నోరూరింది. ఆగలేకపోయాడు.

అసలే ఆకలితో ఉన్నాడేమో.. ఓ పట్టుపట్టేద్దాం అని చక్కగా తాపీగా కూర్చున్నాడు. కూర రుచిగా ఉండటంతో కడుపు నిండా లాగించేశాడు. తిన్నాకైనా తనదారిన తాను పోకుండా ఇంకా కక్కుర్తి పడ్డాడు. చల్లగాలి పీల్చుకోడానికి మేడమీదకు వెళ్లాడు ఏదో అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడిలాగా..

ఫుల్ గా లాగించేశాడేమో..చల్లటి గాలికి కళ్లు మూతలు పడ్డాయి. నిద్ర ముంచుకొచ్చేసంది. అంతే.. మేడ పైనే నిద్రపోయాడు. తెల్లారింది. బారెడు పొద్దెక్కినా మెలకువరాలేదు పాపం బుల్లోడికి. ఇంతలో రాత్రంతా ఎక్కడికి వెళ్లాడోగానీ..ఇంటి యజమాని వచ్చేశాడు. ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు చూసి దొంగతనం జరిగిందని భయపడిపోయాడు. ఇరుగుపొరుగువారికి చెప్పాడు

అందరూ వచ్చారు. దొంగ పారిపోయాడని అనుకున్నారు. ఎందుకైనా మంచిదనీ..ఇంట్లో ఉండే సీసీటీవీ కెమేరాల పుటేజ్ ను పరిశీలించారు ఏమేమి పోయాయా? అని..అలా కెమెరాలో  రికార్డైన వీడియోను చూసి ఓరి..వీడి కక్కుర్తిపాడుగాను..చేపల కూరంతా తినేసి మేడమీదనుంచి దూకి పారిపోయి ఉంటాడని అనుకుంటూ..మేడపైకి వెళ్లారు. అక్కడే నిద్రపోతున్న దొంగను చూసి షాకయ్యారు. 

ఆ తరువాత చేయాల్సిందంతా చేసి..అంటే అతడ్ని లేపి..ఒళ్లు హూనం అయ్యేలా చితక్కొట్టారు. తరువాత తరువాత దొంగగారిని పోలీసులకు అప్పగించారు. అలా ముగిసిందన్నమాట ఆ దొంగగారి చోరీ ఉదంతం. ఏపనిమీద వెళ్లాడోఆ పని చూసుకుని రాకుండా..ఏమీ దొరకపోగా..కక్కుర్తికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు ఈ చేపలకూర దొంగ.

Read: 53ఏళ్ల వయస్సులో మగ కవలలకు జన్మనిచ్చిన మహిళ