Tamil Nadu : గిరిజన మహిళకు సుఖ ప్రసవం అయ్యేలా చేసిన ఏనుగు..తల్లీ..బిడ్డా క్షేమం

తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈరోడ్ జిల్లాలో ఓ ఏనుగు గర్భిణిగా ఉన్న గిరిజన మహిళకు సుఖ ప్రసవం అయ్యేలా చేసింది.

Tamil Nadu: తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఓ ఏనుగు గర్భిణిగా ఉన్న గిరిజన మహిళకు సుఖ ప్రసవం అయ్యేలా చేసింది. ఓ ఏనుగు చేసిన పనివల్ల ఆమె ఆస్పత్రికి వెళ్లకుండానే దారిలోనే సుఖ ప్రసవం జరిగి పండంటి బిడ్డ పుట్టింది. ఇంతకీ ఆమెకు ప్రసవం జరిగేలా ఆ ఏనుగు ఏం చేసిందంటే..అటవీ ప్రాంతానికి చెందిన ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళుతున్నారు.అంబులెన్స్ ఘాట్‌ రోడ్డుమీద ప్రయాణిస్తోంది. అంబులెన్స్ లో గర్భిణి ప్రసవవేదన పడుతోంది.

అంబులెన్స్ ఆస్పత్రికి త్వరగా వెళితే బాగుండు..లేకపోతే తనబిడ్డకు ఏం జరుగుతుందోనని గర్భిణి ఆందోళన పడుతోంది. ఈ క్రమంలో ఆ ఘాట్ రోడ్డుపైకి ఓ భారీ ఏనుగు వచ్చింది. రోడ్డుకు అడ్డంగా నిలబడింది. కదలకుండా ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడే ఏం చేయాలో అంబులెన్స్ డ్రైవర్ కు అర్థం కాలేదు. అది ఏం చేస్తుందోనని భయపడ్డాడు. ధైర్యం చేసి హారన్ మోగించాడు. అయినా ఏనుగు రోడ్డుమీదనుంచి కదల్లేదు.

దాంతో అంబులెన్స్ ముందుకు వెళ్లలేక అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. అలా అర గంట దాటింది. అయినప్పటికీ ఏనుగు అక్కడి నుంచి ఏమాత్రం కదలలేదు. మరోవైపు అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీకి పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. అందులోని వైద్య సిబ్బంది ఆమె ప్రసవం చేయటానికి యత్నించారు. అలా ఆమెకు అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం జరిగి పడంటి మగ శిశువు జన్మనిచ్చింది.

ఇంత జరిగాక ఆ ఏనుగు అక్కడి నుంచి కదిలింది. రోడ్డును వదలి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో మహిళతోపాటు పసి బిడ్డను అంబులెన్స్‌లో స్థానిక గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.







                                    

ట్రెండింగ్ వార్తలు