బంపర్ ఆఫర్ : కారు కొంటే స్కూటర్ ఫ్రీ

  • Publish Date - September 28, 2019 / 02:13 PM IST

టైటిల్ చూసి ఆశ్చర్యపోయారా? జోకులు వేయకండి అంటారా? కారు కొంటే స్కూటర్ ఫ్రీగా ఇవ్వడం ఏంటని సందేహిస్తున్నారా? కానీ.. ఇది నిజం.. కారు కొంటే రూ.70వేలు ఖరీదు చేసే హోండా యాక్టివా స్కూటర్ ఫ్రీగా ఇస్తున్నారు. కారు కొంటే బైక్ కూడా ఫ్రీగా పొందే బంపర్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. మధ్యప్రదేశ్ లో. అక్కడ ఓ టాటా మోటార్స్ డీలర్ ఒకరు ఈ ఆఫర్ అమలు చేస్తున్నారు. టాటా నెక్సన్, టాటా టియాగో, టాటా టిగోర్, టాటా హెక్సా, టాటా హారియర్ మోడల్స్‌లో ఏది కొన్నా హోండా స్కూటర్ ఒకటి ఉచితంగా ఇస్తున్నారు. అయితే ఈ ఆఫర్ కి డెడ్ లైన్ ఉంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రం ఈ ఆఫర్ ఇస్తున్నారు.

ఈ బంపర్ ఆఫర్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. ఆటో మొబైల్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కార్ల సేల్స్ పడిపోయాయి. దీంతో కంపెనీలు నష్టాలు చూస్తున్నాయి. సేల్స్ పెంచుకోవడం కోసం కార్ల కంపెనీలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. టాటా కంపెనీ కూడా తన కార్ల అమ్మకాలపై రూ. 1.5 లక్షల వరకు తగ్గించింది. దీని ఆధారంగా ఓ డీలర్ బైక్ ఆఫర్ పెట్టాడు. ఆ విధంగా సేల్స్ పెంచేందుకు ప్లాన్ వేశాడు. ఈ విషయం తెలిసి.. భలే మంచి చౌక బేరం అని అంతా సంబర పడుతున్నారు. కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కారుతో పాటు స్కూటర్ ని ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఆఫర్ మన తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్టి ఉంటే బాగుండేదని కస్టమర్లు అంటున్నారు.