కొత్త విద్యా విధానంలో, బోర్డులో మంచి మార్కుల కోసం విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసే స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో, 50 సంవత్సరాల పాఠశాల విద్య నిర్మాణం పూర్తిగా మార్చబడింది. ఇప్పుడు 10 ప్లస్ 2 కు బదులుగా 15 సంవత్సరాలు అవబోతుంది. వీటికి మూడేళ్ల ఫౌండేషన్ దశ ఉంటుంది. ఇందులో మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు చదువులు నేర్పిస్తారు. ఇది ప్రీ-ప్రైమరీ నుంచి రెండవ తరగతి వరకు ఉంటుంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న అంగన్వాడీలను ఉపయోగిస్తారు. దీని కోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
మొదటి నుంచి జ్ఞాన ఆధారిత విద్యకు ప్రాధాన్యత:
కొత్త విద్యా విధానంలో పాఠశాల విద్యలో చేసిన మార్పుల గురించి సమాచారం ఇస్తూ పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనితా కార్వాల్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ పద్ధతిలో పాఠశాల పాఠ్యాంశాలను సిద్ధం చేస్తామని చెప్పారు. జ్ఞానం, తర్కం మీద ఆధారపడి చదువులను సిద్ధం చెయ్యనున్నారు.
ఆరో తరగతి నుంచే పిల్లలకు కోడింగ్:
కొత్త జాతీయ విద్యా విధానంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా విధివిధానాలను ఖరారు చేసింది. విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించడమే లక్ష్యంగా భారత్‌ను నాలెడ్జ్ సూపర్ పవర్‌గా తయారు చేసేందుకు నూతన విధానాన్ని రూపొందించింది కేంద్రం. నాణ్యమైన విద్యను అందించే క్రమంలో ఆరవ తరగతి నుంచే కోడింగ్ నేర్పించాలని నిర్ణయించాయి.
కొత్త జాతీయ విద్యా విధానంలో కీలక అంశాలు:
1. యాంత్రికంగా మారిన చదువుల పద్ధతికి ముగింపు పలకడం. ప్రాక్టికల్ విద్యా విధానానికి పెద్ద పీట వేయడం ముఖ్యమైన అంశం. ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన. ఏ విద్యార్ధిపైనా ఏ భాషనూ బలవంతంగా రుద్దలేరు. NEP 2020 (జాతీయ విద్యా విధానం) ప్రకారం సంస్కృతం భాష అన్ని స్థాయిల్లోనూ అందుబాటులో ఉంటుంది. విదేశీ భాషలను మాత్రం సెకండరీ స్ధాయి నుంచి బోధిస్తారు.
2. హిందీని తప్పనిసరి చేయాలన్న NEP ముసాయిదాపై దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే 5వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యను అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
3. ఇంతకుముందు ఉన్న 10+2 స్థానంలో 5+3+3+4ను అమలు చేయనున్నారు. మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సు(3 ఏళ్ల వయసు నుంచి 8 ఏళ్ల వరకు), ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ (8 ఏళ్ల వయసు నుంచి 11 వరకు), ఆ తర్వాత మూడేళ్లను ప్రిపరేటరీ స్టేజ్ (11 ఏళ్ల నుంచి 14 వరకు), ఆ తర్వాతి నాలుగేళ్లను సెకండరీ స్టేజ్ (14 ఏళ్ల వయసు నుంచి 18 వరకు)గా పరిగణిస్తారు.
4. ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించరు. 3, 5, 8 తరగతుల వారికి పరీక్షలు ఉంటాయి. నైపుణ్యాలు పెంచుకునేలా పోటీ పరీక్షలను నిర్వహిస్తారు.
5. 10, 12వ తరగతుల విద్యార్థులకు ఎప్పటిలానే బోర్డు పరీక్షలు నిర్వహించినప్పటికీ.. పరీక్షల విధానంలో పూర్తిగా మార్పులు చేస్తారర.6. విద్యార్థులపై పాఠ్యాంశాల భారాన్ని తగ్గిస్తారు. ఒకరకమైన సబ్జెక్టు, భాషపై కాకుండా వివిధ అంశాలు, భాషల్లో పట్టు సాధించేలా కొత్త విద్యా విధానాంలో మార్పులు చేశారు.
7. ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్ధల్లోనూ మార్పులు. 2050 నాటికి ఐఐటీ వంటి సంస్థల్లోనూ ఆర్ట్స్, మానవ విజ్ఞాన శాస్త్రాలులను చేర్చుతారు. సైన్స్ చదివే విద్యార్థులు ఆర్ట్స్ చదువుకోవచ్చు. ఆర్ట్స్ చదివే విద్యార్థులు సైన్స్ చదువుకోవచ్చు.
8. డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్వవధి ఏడాదిగా నిర్ణయించారు. అలానే డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లుగా మార్పు చేయనున్నారు.
9. ఉన్నత విద్యను నియంత్రించడానికి ‘హయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (HECI) ఏర్పాటు చేస్తారు. 3వేల మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న సంస్థలపై HECI దృష్టి పెడుతుంది.
10. HECI కింద నాలుగు ఇండిపెండెంట్ వర్టికల్స్ ఉంటాయి. నియంత్రణ కోసం నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఫర్ రెగ్యులేషన్, ప్రమాణాల రూపకల్పన కోసం జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఫండింగ్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, అక్రిడేషన్ కోసం నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ ఏర్పాటు కానున్నాయి.