Tejas Aircraft Tech Oxygen : ‘తేజస్’ యుద్ధ విమాన టెక్నాలజీతో కోవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ తయారీ..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. ఢిల్లీ సహా ఇతర నగరాలు ఆక్సిజన్ తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించేందుకు DRDO యుద్ధ విమానాలను వినియోగించనుంది.

Tejas Aircraft Tech Oxygen (1)

Tejas aircraft tech comes in aid : కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర నగరాలు మెడికల్ ఆక్సిజన్ తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) యుద్ధ విమానాలను వినియోగించనుంది. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించనుంది. అప్పటికప్పుడూ గాలిలోనే ఆక్సిజన్ తయారుచేయనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో అక్కడికక్కడే ఆక్సిజన్‌ తయారు చేసేలా కొత్త టెక్నాలజీని వినియోగించనుంది. అదే.. మెడికల్ ఆక్సిన్ ప్లాంట్ (MOP) టెక్నాలజీ.. దీన్ని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.

పీఎం కేర్స్ ఫండ్ స్కీమ్ కింద డీఆర్డీఓ ఈ టెక్నాలజీని వినియోగించి.. దేశవ్యాప్తంగా కేవలం మూడు నెలల వ్యవధిలోనే 500 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. మే 10 నాటికి ఎన్ సీఆర్ లో కనీసం 5 ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని డీఆర్డీఓ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ టెక్నాలజీ సాయంతో ఏర్పాటయ్యే కేంద్రాలు ఒక్కొక్కటీ నిమిషానికి వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక్కో కేంద్రంతో 190 మందికి ఆక్సిజన్‌ అందించవచ్చు. అదనంగా 195 సిలిండర్లను నింపవచ్చు. MOP టెక్నాలజీ సాయంతో అక్కడిక్కడే ఆన్ బోర్డు ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్(OBOGS) ప్రాజెక్టును ప్రారంభించింది. తేజస్ యుద్ధ విమానంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. ప్రపంచంలో ఈ తరహా టెక్నాలజీని అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ అవతరించింది.

డీఆర్‌డీవో తయారు చేస్తున్న మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు అన్నీ ‘ప్రెషర్‌ స్వింగ్‌ అబ్జార్‌ప్షన్‌ (PSA)టెక్నాలజీతో పనిచేస్తాయి. వాతావరణంలోని గాలిని నేరుగా పీల్చుకుని ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. దేశంలో కరోనా సంక్షోభం మధ్య డీఆర్డీఓ ఈ టెక్నాలజీన ప్రైవేటు కంపెనీలైన టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్, బెంగళూరు, ట్రిడెంట్ పెన్యూమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోయింబత్తూరు కంపెనీలకు బదలాయించింది. ఈ రెండు సంస్థలు 380 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను తయారు చేసి డీఆర్‌డీవోకు అందించనున్నాయి. టాటా 332 ఆర్డర్లతో సరఫరా చేయనుండగా.. ట్రిడెంట్ 48 వరకు ఉత్పత్తి చేయనుంది.

ఎలా పనిచేస్తుందంటే ? :
జియోలైట్‌ పదార్థం సాయంతో ఇతర వాయువులను తొలగించి 93±3శాతం గాఢతతో ఆక్సిజన్‌ను వేరు చేస్తారు. ఇలా తయారైన ఆక్సిజన్ ను నేరుగా కోవిడ్‌ రోగులకు అందించవచ్చు. అవసరమైతే సిలిండర్లలో నింపుకోవచ్చు. ఆస్పత్రుల్లో అక్కడికక్కడే ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. సుదూర, ఎత్తైన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డీఆర్‌డీవో అభిప్రాయపడింది. పీఎం కేర్స్‌ నిధుల ద్వారా నెలకు 120 చొప్పున ఆక్సిజన్‌ ఉత్పత్తి వ్యవస్థలను తయారు చేయనుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఒక్కో వ్యక్తికి 5 LPM సామర్థ్యంతో ఆక్సిజన్ అందించేలా డిజైన్ చేశారు. 960 LPM (గంటకు 57.6 M3 / గంట) మొత్తం సామర్థ్యంతో 200 మంది వరకు అందించవచ్చు.