Tejashwi Yadav’s “Onion Garland” For BJP In Last Mile Of Bihar Campaign బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఉల్లి ధరలు విషయంలో మోడీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి విపక్షాలు. బిహార్ ఎన్నికల్లో నిరుద్యోగంతో పాటు ఉల్లిగడ్డల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కూడా ప్రధాన అంశాలుగా మారినట్లు రాష్ట్రీయ జనతా దళ్(RJD)నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ తేజస్వీ తెలిపారు.
ఉల్లి ధరల పెరుగుదలపై తేజస్వీ యాదవ్..సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఉల్లిగడ్డలతో తయారుచేసిన దండను చేపట్టి తేజస్వి యాదవ్.. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ధరల పెరుగుదల, అవినీతి, నిరుద్యోగ సమస్యలతో సామాన్యుడు సతమతమవుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు, యువత, వ్యాపారులు ఆహారంపై ఖర్చును భరించే స్థితిలో లేరని, చిరు వ్యాపారులను బీజేపీ దెబ్బతీసిందని తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు.
ద్రవ్యోల్బణం అనేది అతిపెద్ద అంశం. ప్రస్తుతం ఉల్లిపాయల ధర కిలోకి రూ.100కి చేరింది. ఉల్లి ధరలు రూ.50-60 మధ్య ఉన్నప్పుడు మాట్లాడిన వారంతా.. ఇప్పడు కిలో 100 రూపాయలు ఉన్నా మౌనంగా ఉంటున్నారు. రాష్ట్రంలో అవినీతి, పేదరికం పెరిగిపోతున్నాయి. నిరుద్యోగం పెరిగింది. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. జీడీపీ క్షీణిస్తోంది. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాం. రైతులు తీవ్రంగా నష్టపోయారు. బిహార్ పేద రాష్ట్రంగా మారటం వల్ల ప్రజలు.. విద్య, ఉద్యోగాలు, వైద్య సహాయం కోసం వలస పోతున్నారని తేజస్వీ అన్నారు. ఉల్లి దండలతో నిరసన తెలుపుతున్న ఫోటోలను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఇక, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హయాంలో రూ.30వేల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో ఖర్చు చేస్తున్న నిధులపై ఆడిట్ జరగటం లేదని, అవినీతి పెరిగిపోయిందని తేజస్వీ ఆరోపించారు. లంచం లేకుండా ఏ పని జరగటం లేదన్నారు. ఆ సంప్రదాయాన్ని నితీశ్ జీ రూపొందించారని విమర్శించారు.
ఇక తాము అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలను యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చిన తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఉపాథి కల్పన కీలక అంశమని పునరుద్ఘాటించారు. కాగా, 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొత్తం 3దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్-28న మొదటి దశలో భాగంగా 71స్థానాలకు పోలింగ్ జరుగనుండగా..నవంబర్-3న రెండో దశలో భాగంగా 94స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఇక మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది.