తెలంగాణ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా? పీఎం కుర్చీపై ఆయన కన్నేశారా? త్వరలోనే జాతీయ పార్టీని ఆయన స్థాపించబోతున్నారా? జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారా? కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
2024 ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నయా భారత్ అనే పార్టీని కేసీఆర్ స్థాపించబోతున్నారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. పార్టీ పేరును ఆల్రెడీ ఫైనలైజ్ చేశారన్న ప్రచారమైతే జోరుగా సాగుతోంది.
వాస్తవానికి 2019 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ప్రయత్నాలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని ప్రయత్నాలు కూడా చేశారు. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీఎస్ తోపాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలను కూడా ఆయన కలిశారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్, బీజేపీపైనా ఆయన పలుమార్లు విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు 70ఏళ్లుగా దేశాన్ని ఏం అభివృద్ధి చేశాయంటూ నిలదీశారు.
వ్యూహాలు రచిస్తున్నారని ప్రచారం :
2019 ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో….ఫెడరల్ ఫ్రంట్‌కు కేసీఆర్ ఓ రూపం ఇవ్వలేకపోయారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టడానికి పావులు కదపలేకపోయారు. ఇప్పుడు మాత్రం కచ్చితంగా టార్గెట్ చేరుకునేలా వ్యూహాలు రచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
నేషనల్ పాలిటిక్స్‌పై కేసీఆర్ దృష్టి :
కేసీఆర్ ఇప్పటికే తన కొడుకు, మంత్రి కేటీఆర్ ద్వారా… ప్రభుత్వ కార్యకలాపాల్ని ముందుకు నడిపిస్తున్నారు. దీంతో కేసీఆర్ ఈమధ్య పెద్దగా మెయిన్ పాలిటిక్స్‌లో కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం… ఆయన తెరవెనక జాతీయ స్థాయి పాలిటిక్స్‌పై దృష్టి సారించడమేనన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. నేషనల్ పాలిటిక్స్‌లోకి కేసీఆర్ వెళ్తున్నారని.. అందుకే సొంత పార్టీని పెట్టనున్నారన్న ప్రచారం సాగుతోంది.
జాతీయ పార్టీ ప్రచారాలకు చెక్ :
జాతీయ పార్టీ పెట్టబోతున్నట్టు వస్తున్న ఊహాగానాలపై కేసీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సహావేశంలో ఈ మేరకు ఆయన జాతీయ పార్టీ ప్రచారాలకు చెక్ పెట్టారు. ప్రస్తుతానికైతే తనకు జాతీయ పార్టీ పెట్టే ఆలోచనేదీ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మొత్తానికి కేసీఆర్ జాతీయ పార్టీపై వస్తున్న ప్రచారానికి తాత్కాలిక బ్రేక్ పడింది. స్వయంగా కేసీఆరే పార్టీని పెట్టడం లేదని ప్రకటించడంతో… ఊహాగానాలకు చెక్ పడింది.