Indian Cardinals: కాబోయే పోప్ ను ఎన్నుకోవడంలో ఓ తెలుగు వ్యక్తికీ ఓటు ఉంది.. ఆయన ఎవరంటే..

వీరిలో 135 మంది తదుపరి పోప్‌ను ఎన్నుకునే సమావేశంలో ఓటు వేయడానికి అర్హులు. సిస్టీన్ చాపెల్‌లో జరిగే ఈ పవిత్ర సమావేశంలో యావత్ ప్రపంచం...

Indian Cardinals: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ (88) వాటికన్ సిటీలోని తన నివాసంలో కన్నుమూశారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ప్రాన్సిస్ 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. పోప్ 88 సంవత్సరాల వయసులో ఈస్టర్ సోమవారం నాడు వాటికన్‌లోని కాసా శాంటా మార్టాలోని తన నివాసంలో మరణించారు. పోప్ మృతితో వాటికన్ సిటీలో కొత్త పోప్ ఎన్నిక జరగనుంది. కాబోయే పోప్ ను ఎన్నుకోవడంలో ఓ తెలుగు వ్యక్తికీ ఓటు ఉంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ తెలుగు వ్యక్తి ఎవరు?

పోప్ ఫ్రాన్సిస్ మరణంతో తొమ్మిది రోజుల సంతాప దినాన్ని పాటిస్తారు. ఇది నేటికీ ఆచరణలో ఉన్న పురాతన రోమన్ సంప్రదాయం. ఈ గంభీరమైన సమయంలో తదుపరి పోప్ ఎన్నికకు సన్నాహాలు సైలెంట్ గా ప్రారంభమవుతాయి. సంతాప దినం ముగిసిన తర్వాత కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ కొత్త పోప్ ను ఎన్నుకోవడానికి సమావేశం అవుతారు.

Also Read: కొత్త పోప్‌ను ఎలా ఎన్నుకుంటారు, అసలు పోప్ అంటే ఎవరు, ఆ రంగులకు అర్థం ఏంటి, అంత్యక్రియులు ఎలా చేస్తారు..

ప్రస్తుతం పాపల్ కాన్‌క్లేవ్‌లో ఓటు వేయడానికి అర్హత ఉన్న 135 మంది కార్డినల్స్‌లో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఆ నలుగురు ఎవరంటే.. కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రావ్, కార్డినల్ బసేలియోస్ క్లీమిస్, కార్డినల్ ఆంథోనీ పూల, కార్డినల్ జార్జ్ జాకబ్ కూవాకాడ్.

ఆ నలుగురు భారతీయులు వీరే..
కార్డినల్ జార్జ్ జాకబ్ కూవకాడ్: 51 ఏళ్ల జాకబ్ ప్రస్తుతం సెయింట్ ఆంటోనియో డి పడోవా ఎ సర్కోన్వాలాజియోన్ అప్పియా కార్డినల్-డీకన్‌గా ఉన్నారు. డికాస్టరీ ఫర్ ఇంటర్‌రిలిజియస్ డైలాగ్ ప్రిఫెక్ట్ పదవిని కూడా కలిగున్నారు. వివిధ విశ్వాసాల మధ్య అవగాహనను ప్రోత్సహించడానికి వాటికన్ చేస్తున్న ప్రయత్నాల్లో ఆయన పాత్ర ఆయనను ముందంజలో ఉంచుతుంది.

కార్డినల్ ఫిలిప్ నేరి ఆంటోనియో సెబాస్టియావో డో రోసారియో ఫెర్రావ్: 72 ఏళ్ల రోసారియో భారతదేశంలోని గోవా, డామన్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్. ప్రస్తుతం ఆయన భారత కాథలిక్ బిషప్‌ల సమావేశానికి అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అదనంగా, ఆసియా బిషప్‌ల సమావేశాల సమాఖ్యకు అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తున్నారు.

కార్డినల్ ఆంథోనీ పూల: 63 ఏళ్ల ఆంథోనీ పూల హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్.

కార్డినల్ బసేలియోస్ క్లీమిస్ తొట్టుంకల్: సిరో-మలంకర త్రివేండ్రం మేజర్ ఆర్చ్ బిషప్. సిరో-మలంకర చర్చి సైనాడ్ అధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నారు.

ఏప్రిల్ 19 నాటికి కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ 252 మంది సభ్యులతో ఉంది. వీరిలో 135 మంది తదుపరి పోప్‌ను ఎన్నుకునే సమావేశంలో ఓటు వేయడానికి అర్హులు. సిస్టీన్ చాపెల్‌లో జరిగే ఈ పవిత్ర సమావేశంలో యావత్ ప్రపంచం శతాబ్దాల నాటి సంకేతాన్ని ఆసక్తిగా గమనిస్తుంది. నల్ల పొగ పోప్ ఎన్నికలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సూచిస్తుంది. తెల్ల పొగ కొత్త పోప్ విజయవంతమైన ఎన్నికను ప్రకటిస్తుంది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here