Encounter
Jammu and Kashmir: జమ్మూకశ్మీరులోని పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైంది. కెరాన్ సెక్టారులోని జుమాగుండ్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో కేంద్ర భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయని సోమవారం అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని ఆర్మీ విఫలం చేసింది.
Also Read : Indian woman Anju : పిల్లల్ని చూసేందుకు పాక్ నుంచి భారత్ రానున్న అంజూ
కెరాన్ సెక్టార్‌లోని జుమాగుండ్ ప్రాంతంలో చొరబాటు బిడ్ ఆదివారం రాత్రి విఫలమైంది. సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో జరిపిన శోధనలో ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల పాకిస్థాన్ దేశం నుంచి తరచూ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు సరిహద్దుల్లో యత్నిస్తున్నారు. దీంతో మన సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి.
Also Read : Kerala Bomb Blast : ఢిల్లీ, ముంబయితోపాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్
సరిహద్దుల్లో తరచూ ఎదురుకాల్పులు సైతం జరిగాయి. ఇటీవల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు కూడా గాయపడ్డారు. పాక్ బలగాల కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. సరిహద్దుల్లో సైనికులు హైఅలర్ట్ ప్రకటించారు.
బంకర్లలో తలదాచుకుంటున్న సరిహద్దు గ్రామాల ప్రజలు
పాక్ కాల్పుల ఘటనలతో జమ్మూకశ్మీరులోని ఆర్నియా ప్రాంతంలో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. బంకర్లను శుభ్రం చేసి సిద్ధం చేశారు. పాక్ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల్లో 14,480 బంకర్లను ప్రభుత్వం నిర్మించింది. కథువా, సాంబా, రాజౌరి జిల్లాల్లో బంకర్లను సర్కారు నిర్మించింది. ఆర్ఎస్ పురా ప్రాంతంలో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ గాయపడ్డారు.
పోలీసు ఎస్ఐను కాల్చిచంపిన ఉగ్రవాదులు
ఆదివారం శ్రీనగర్ ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతున్న పోలీసు సబ్ ఇన్ స్పెక్టరును ఓ ఉగ్రవాది కాల్చి చంపారు. ఎస్ఐను తామే కాల్చి చంపినట్లు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రకటించారు. పాక్ రేంజర్ల కాల్పులు, ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు, ఎదురుకాల్పుల ఘటనలతో జమ్మూకశ్మీరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.