Kerala Dowry Case
Kerala Dowry Case : వరకట్న వేధింపుల కారణంగా కేరళలో బలవన్మరణానికి పాల్పడిన డాక్టర్ షహానా కేసులో పలు విషయాలు బయటకు వస్తున్నాయి. వరకట్న వేధింపులకు తన సోదరి బలైందని.. ప్రేమించిన వాడు అండగా నిలబడలేదని ఆమె సోదరుడు జాసిమ్ ఆరోపిస్తున్నాడు.
Kerala : BMW కారు ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్.. మనస్తాపంతో యువ వైద్యురాలు బలవన్మరణం
కేరళలో యువ వైద్యురాలు షహానా బలవన్మరణానికి పాల్పడటం సంచలనం రేపింది. వరకట్న వేధింపులే ఈ మరణానికి కారణంగా తెలుస్తోంది. తాజాగా ఆమె సోదరుడు జాసిమ్ షహానా మరణంపై పలు ఆరోపణలు చేశాడు. నవంబర్‌లో తమ ఇంటికి వచ్చిన రువైస్ తన సోదరి షహానాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని వెంటనే తాము రువైస్ ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబాన్ని కలిశామని చెప్పాడు. అయితే అతని తండ్రి కట్నంగా 150 గ్రాముల బంగారం, 15 ఎకరాల భూమి, BMW కారు డిమాండ్ చేశారని..అందుకు తాము చేయగలిగినంత ఇస్తామని చెప్పినా వారు మాట వినలేదని జాసిమ్ అన్నాడు. తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసే ఆలోచనలో ఉంటే రువైస్ తన పేరెంట్స్ మాటలు విని వెనక్కి తగ్గడంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని జాసిమ్ తెలిపాడు. ఆ తర్వాత తన సోదరి షహానా బాగా డిప్రెస్ అయ్యిందని కూడా చెప్పాడు.
ఇంత జరిగిన తర్వాత రువైస్‌ను ఎలా ఫేస్ చేయాలా? అని భయపడిన తన సోదరి అనస్థీషియా ఓవర్ డోస్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడిందని జాసిమ్ చెబుతున్నాడు. ఆమె గదిలో ‘అందరికీ డబ్బు మాత్రమే కావాలి’ అని రాసిన లెటర్ దొరికిందని తెలుస్తోంది. షహానా, రువైస్ తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. రువైస్ కేరళ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో ఉన్నట్లు తెలుస్తోంది. రువైస్‌కి ఉన్న పాపులారిటీ చూసి మంచి వాడని నమ్మి తన సోదరి షహానా అతడిని పెళ్లి చేసుకోవాలని భావించినట్లు జాసిమ్ ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న రువైస్‌ను తిరువనంతపురం మెడికల్ కాలేజీ సస్పెండ్ చేసింది.