Vaccine (2)
MRNA vaccine safe : కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌లను రూపొందించడంలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిచిన భారత్.. తాజాగా మరో పురోగతి సాధించింది. తొలిసారిగా mRNA సాంకేతికతో దేశీయంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని తేలింది. దీంతో రెండు, మూడో దశల ప్రయోగాలను కొనసాగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మా కంపెనీ ‘HGC019’ mRNA ఆధారిత టీకాను రూపొందించింది. వీటిపై తొలిదశ ప్రయోగాలు పూర్తి చేసిన జెన్నోవా.. తాజాగా వీటి మధ్యంతర ప్రయోగ ఫలితాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు అందించింది. రోగనిరోధకతను ఇవ్వడంతో పాటు టీకా సురక్షితమైనదేనని నిపుణుల కమిటీ నిర్ధారించినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ ప్రకటించింది.
ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌లలో mRNA సాంకేతికతతో రూపొందిన టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అమెరికాకు చెందిన ఫైజర్-బయోఎన్‌టెక్‌తో పాటు మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్‌లు ఎంఆర్‌ఎన్‌ఏ విధానంలోనే అభివృద్ధి చేశారు. ప్రయోగాలతో పాటు వాస్తవ ఫలితాల్లోనూ కొవిడ్-19 ను ఎదుర్కోవడంలో ఎం.ఆర్.ఎన్.ఏ టీకాలు 90 శాతానికి పైగా సమర్థత చూపించినట్లు తేలింది.