రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు..రెండు వ్యాక్సిన్లు అభివృద్ధి చేశాం

President Ramnath Kovind addressed the budget meetings of Parliament : రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కొత్త చట్టాలతో 10 లక్షల మంది రైతులకు తక్షణ ఉపయోగం కలుగుతోందన్నారు. కొత్త చట్టాలతో రైతలకు విస్తృత అవకాశాలు కలుగుతాయని చెప్పారు.

దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. సాగులో ఆధునిక విధానాల్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. కొత్త విధానాలతో రికార్డుస్థాయిలో ఉత్పత్తి జరుగుతుందన్నారు. రైతులకు కూడా ఆత్మనిర్భర్ ప్కాకేజ్ ప్రకటించామని వెల్లడించారు.

సమస్యలు, సవాళ్లను అధిగమించి భారత్ మొందుకెళ్తోందని తెలిపారు. ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంటుందన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏకతాటిపై నిలిచామని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ సమావేశాలు విశిష్టమైనవని తెలిపారు.

కరోనా, బర్డ్ ఫ్లూను భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు. సమస్య ఏదైనా భారత్ ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పారు. ఎంత పెద్ద సవాల్ అయినా భారత్ ముందు తలొంచాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకే లక్ష్యం, ఒకే ఆశయం కోసం భారత్ పని చేస్తోందన్నారు. గతేడాది భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొందని గుర్తు చేశారు.

లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకున్నామని తెలిపారు. రెండు వ్యాక్సిన్లను భారత్ లో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కరోనా ఎందరో మహనీయుల్ని బలి తీసుకుందన్నారు. ప్రణబ్ ముఖర్జీ లాంటి నేతలను కరోనా కారణంగా కోల్పోయామని తెలిపారు. సంక్లిష్ట పరిస్థితుల్లో చాలా ప్రాధాన్యతలతో బడ్జెట్ ప్రవేశపడుతున్నామని చెప్పారు.

ఆత్మనిర్భర్ ప్యాకేజ్ క్లిష్ట పరిస్థితుల్లో ఒక వరంగా మారిందన్నారు. ఆయుష్మాన్ భారత్ లో పేదలకు మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. కోటిన్నర మందికి ఉచితంగా వైద్యసాయం అందించామని తెలిపారు. పేదల కోసం వన్ నేషన్-వన్ రేషన్ అమలు చేసినట్లు ప్రకటించారు. జన్ ధన్ యోజనతో నేరుగా అకౌంట్లలోకి నగదు బదిలీ జరిగిందని తెలిపారు.