PM Modi Speech Lok Sabha
PM Modi Parliament Sessions : ప్రజాస్వామ్యానికి పాత పార్లమెంట్ చిహ్నమని.. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చారిత్రక విజయాలెన్నింటినో మనం స్మరించుకోవాలని తెలిపారు. మనం కొత్త భవనంలోకి వెళ్తన్నప్పటికీ పాత భవనం రానున్న తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు చెబుతున్నామని తెలిపారు.
ఈ భవనాన్ని వదిలిపెట్టడం అంత తేలికైన విషయం కాదన్నారు. కుటుంబం తన ఇంటిని వదిలివెళ్లేటప్పుడు ఎన్నో అనుభూతులు వెంటాడుతాయని చెప్పారు. అలాగే ఈ పార్లమెంట్ భవనాన్ని వదలివెళ్తున్నప్పుడు కూడా ఎన్నో స్మృతులు గుర్తుకు వస్తాయని చెప్పారు. భారత్ నిర్మాణాన్ని గొప్పగా చెప్పుకోవాలన్నారు. అనేక రంగాల్లో భారత్ గణనీయ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
ప్రపంచం నలుమూలలా భారతీయుల ప్రతిభా పాటవాలకు ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు.
చంద్రయాన్ 3 విజయాన్ని ప్రపంచం మొత్తం సంబరంలా చేసుకుందని వెల్లడించారు. భారత్ అధ్యక్షత వహించిన జీ20 సమావేశాల్లో మరుపురాని ఘటన జరిగిందన్నారు. ఆఫ్రికా యూనియన్ ను జీ20లో భాగం చేశామని తెలిపారు. జీ20 విజయం 140 కోట్ల ప్రజలది అన్నారు. సమిష్టి కృషి వల్లే జీ20 విజయవంతం అయిందని తెలిపారు. జీ20 సక్సెస్ ను ప్రపంచమంతా కీర్తించిందన్నారు.