రైతులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం..ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

Lathicharge and tear gas over Farmers : ఢిల్లీలోని సంజయ్‌ గాంధీ ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అనుమతించిన సమయం కంటే ముందుగా ట్రాక్టర్లతో ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు పలుచోట్ల బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రైతులను చెదరగొట్టేందుకు భారీగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిన రీతిలో భారీ ఎత్తున పొగ వ్యాపించింది.

దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైపు గణతంత్ర పరేడ్ జరుగుతోంటే…మరోవైపు సరిహద్దుల్లో రైతులు ట్రాక్టర్ల పరేడ్ ప్రారంభించారు. మధ్యాహ్నం పన్నెండుగంటలలోపు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు పోలీసుల అనుమతి లేకపోయినప్పటికీ ట్రాక్టర్లతో దేశరాజధానిలోకి వచ్చేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.

ఇవాళ ఉదయం ఢిల్లీలో రైతు సంఘాల ట్రాక్లర్ల ర్యాలీకి ముందు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. నగర శివార్లలోని సింఘు దగ్గర ఉద్రిక్తత చెలరేగింది. ట్రాక్టర్ల పరేడ్‌ కోసం సరిహద్దులకు భారీగా చేరుకున్న రైతులు ఢిల్లీలో ప్రవేశించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాతే ట్రాక్టర్లను ఢిల్లీలోకి అనుమతిస్తామని పోలీసులు ప్రకటించినప్పటికీ… రైతులు ముందుగానే పరేడ్ మొదలుపెట్టాలన్న భావనలో ఉన్నారు. ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది.