యూపీలో గ్రహాంతరవాసి…పరుగులు తీసిన జనం!

Iron Man Balloon Triggers Panic In UP హాలీవుడ్ సినిమాల్లో… ఫిక్షనల్ కామిక్ క్యారెక్టర్ ఐరన్ మేన్ మీకు తెలిసే ఉంటాడు. అలాంటి ఐరన్ మేన్ నోయిడా ప్రజలకు నిజంగానే కనిపించాడు. ఆకాశంలో ఎగురుతూ ఉండటంతో ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఆ ఐరన్ మేన్ చాలా వేగంగా అటూ ఇటూ కదులుతూ… గాల్లో తిరుగుతుంటే భయపడిన ప్రజలు పరుగులు పెట్టారు. అది ఏలియన్‌లాగా గాల్లోంచి నేలపై దిగటంతో జనం బిక్కచచ్చిపోయారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నాక అసలు విషయం బయటపడింది.



శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్‌ నోయిడాలోని దాన్‌కౌర్‌ ప్రాంతంలో ఓ వింత ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించింది. కొంతసేపటి తర్వాత దగ్గర్లోని భట్టా పర్సాల్ గ్రామంలోని ఓ కాలువలోకి దిగి, అక్కడే కొద్దిసేపు కదులుతూ కనిపింది. దాని చూసిన జనం ఆ ఆకారం గ్రహాంతర వాసే అనుకుంటూ పరుగులు పెట్టి… కాలువ చుట్టూ మూగారు. అది అచ్చం ఏలియన్‌ లాగానే ఉందంటూ.. కాదు, కాదు ఏలియనే అంటూ భయభ్రాంతులకు గురయ్యారు.



ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. మధ్యాహ్నం సమయంలో ఆ బెలూన్‌ని కాలువ నుంచి బయటకు తీశారు. మొత్తానికి తీవ్ర కలకలం రేపిన ఆకారం బెలూన్ కావడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. బెలూన్‌ గాల్లోకి ఎగరటానికి ఆధారమైన గ్యాస్‌ తగ్గుతుండటంతో అది నేలపై పడిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని దాన్‌కౌర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ పాండే స్థానికులకు వివరించారు.

అది మామూలు బెలూన్ అయి ఉంటే ఎవరూ టెన్షన్ పడేవాళ్లు కాదని, కానీ అది ఐరన్ మేన్ ఆకారంలో ఉండటం, కలర్, డిజైన్ అన్నీ అలాగే ఉండటంతో నిజంగానే ఏలియన్ కావచ్చని ప్రజలు టెన్షన్ పడ్డారని అనిల్‌కుమార్‌ పాండే తెలిపారు. ఆ గ్యాస్ బెలూన్‌ను గాల్లో ఎవరు వదిలారో తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు