Delhi Chalo : సరిహద్దుల్లోనే బైఠాయించిన రైతన్నలు

  • Publish Date - November 29, 2020 / 10:54 AM IST

farmers dug in their heels at Delhi’s border points : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళన కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఛలో పేరిట రైతులు భారీ ఎత్తున తరలివచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ – ఘజియాబాద్ సరిహద్దుల వద్ద రైతులు బైఠాయించారు. మరోవైపు సింఘు సరిహద్దులో కూడా లక్షలాది మంది రైతులు బస చేశారు. తాము ఇక్కడే ఉంటామని, ఎక్కడకు వెళ్లబోమని ఖరాఖండిగా చెబుతున్నారు. రామ్ లీలా మైదానంలో ఆందోళనలకు అనుమతినివ్వాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనికి కేంద్రం ఒప్పుకోవడం లేదు.



నిరంకారీ మైదాన్ లో శాంతియుతంగా రైతులు ఆందోళన చేపడుతున్నారు. ఎలాంటి ఆందోళన, నిరసనలు తెలియచేయాలనే దానిపై ప్రతి రోజు 11 గంటలకు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని 250 రైతు సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు తెచ్చుకోవడం జరిగిందని, కేంద్రం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఇక్కడే ఉంటామని తేల్చిచెబుతున్నారు. రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు, వారు కూడా పోలీసులకు సహకరిస్తున్నారని ఢిల్లీ అదనపు కమిషనర్ తెలియచేశారు.



సెంట్రల్ ఢిల్లీలో ఆందోళనలు చేయాలని అనుకుంటున్నామని, తమ గళం అక్కడే వినిపిస్తామని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి వెల్లడించారు. ప్రభుత్వం చర్చలు జరపడానికి ముందుకు వస్తే..తాము అంగీకరిస్తామన్నారు.
వ్యవసాయ చట్టాల కారణంగా రైతులకు కలిగే నష్టాన్ని దేశప్రజలందరి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. వాటి పిలుపు మేరకు ఛలో ఢిల్లీలో పాల్గొనేందుకు పంజాబ్‌, హర్యానా నుంచి లక్షలాదిగా రైతులు తరలివచ్చారు. రైతుల ఆందోళనకు అనుమతి ఇవ్వని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున సాయుధ బలగాలను పంజాబ్, హర్యానా సరిహద్దులకు తరలించింది.



దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పంజాబ్, హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన రైతులను ఐదు సరిహద్దుల దగ్గర భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. వెల్లువలా తరలివచ్చిన రైతులను ఢిల్లీ వెళ్లకుండా నియంత్రించేందుకు వారిపై వాటర్‌ కెనాన్లు, భాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.