BMC : క్యాంటీన్‌‌ నుంచి స్పూన్లు, ప్లేట్లు, గ్లాసులు ఎత్తుకుపోతున్న ఉద్యోగులు .. యాజమాన్యం ఏం చేసిందంటే..

ఆఫీసు క్యాంటీన్ లో టిఫిన్లు, భోజనాలు చేసాక ఉద్యోగులు అక్కడి చెంచాలను, టిఫిన్‌ ప్లేట్లను బ్యాగులో వేసుకొని వెళ్లిపోతున్నారట. దీంతో క్యాంటీన్ నిర్వహకులు తలలు పట్టుకుంటున్నారు.

BMC Canteen

BMC Canteen : ముంబైలోని బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)క్యాంటీన్ లో స్పూన్లు, ప్లేట్లు, గ్లాసులు మాయం అయిపోతున్నాయట. 10,20 కాదు ఏకంగా వేల సంఖ్యలో స్పూన్లు,ప్లేట్లు, గ్లాసులు మాయం అవుతుండటంతో క్యాంటీన్ నిర్వహకులు తలలు పట్టుకుంటున్నారు. క్యాంటీన్ లో భోజనాలు చేశాక ఉద్యోగులు, ఇతరల ఖాతాదారులు తమ చేతివాటంతో క్యాంటీన్ లోని సామాన్లును మాయం చేస్తున్నారట.

బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ముంబయి సిద్ధివినాయక్‌ క్యాటరర్స్‌ పేరుతో క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నారు. ఆ క్యాంటీన్‌కు బీఎంసీలో పని చేసే ఉద్యోగులు భోజనాలు చేస్తుంటారు. వారితో పాటు ఇతరులు కూడా వచ్చి టిఫిన్లు, భోజనాలు చేస్తుంటారు. అలా వచ్చిన వారు తిన్న తర్వాత అక్కడి చెంచాలను, టిఫిన్‌ ప్లేట్లను బ్యాగులో వేసుకొని వెళ్లిపోతున్నారట.

ఈ విషయాన్ని గుర్తించిన నిర్వహకులు క్యాంటీన్‌ పరిసరాల్లోనే తినాలని..బయటకు తీసుకెళ్లొద్దని కోరారు. కానీ ఈవిషయాన్ని ఎవ్వరు పట్టించుకోలేదు. స్పూన్లు వగైరాలు మాయం అవ్వటం మానలేదు. దీంతో ‘‘క్యాంటీన్‌లోని వస్తువులను ఖాతాదారులు బయటకు తీసుకెళ్లిపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. చెంచాలు, ప్లేట్లు, గ్లాసులు కనిపించడం లేదు. దీనివల్ల మిగతా ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఇక్కడి వస్తువులను ఎవరూ బయటకు తీసుకెళ్లొద్దు. ఇప్పటి వరకు 6000కు పైగా చెంచాలు, 400 ప్లేట్లు, 100కు పైగా గ్లాసులు పోయాయి’’ అని రాసి పెద్ద నోటీసు బోర్డు పెట్టింది.

కాగా బీఎంసీ ప్రధాన కార్యాలయం కొత్త అనెక్స్ భవనం మొదటి అంతస్తులో ఉన్న ఈ క్యాంటీన్ పౌర అధికారులు, సామాన్యులు,సహాయక సిబ్బంది, కాంట్రాక్టర్లతో పాటు రాజకీయ నాయకులతో సహా దాదాపు 1,000మందికి ప్రతీరోజు ఆహారం అందిస్తుంది.