Three Old Women Administered Anti Rabies Vaccine Instead Of Covid 19 In Ups Shamli Probe Ordered
Anti-Rabies Vaccine : కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లిన ముగ్గురు వృద్ధులకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలకు కోవిడ్ వ్యాక్సిన్ కు బదులుగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని షామ్లీలోని కందాలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జరిగింది.
ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధ మహిళల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సెంటర్ లో పనిచేసే వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ కు ర్యాబిస్ వ్యాక్సిన్ కు తేడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆ ముగ్గురు వృద్ధుల్లో సరోజ్ (70), అనార్కలి (72), సత్యావతి (60) ఉన్నారు.
హెల్త్ సెంటర్ సిబ్బంది ఎంప్టీ సీరంజీలను కొనేందుకు బయటకు పంపించారని, ఆ తర్వాత వారికి కరోనా టీకాకు బదులుగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చి ఇంటికి పంపారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సరోజా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా.. ఆమెకు తల తిరగడం వంటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు.
వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. ఆమెకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు సీఎంఓ అసిస్టెంట్ ను నియమించినట్టు డీఎం జెస్ జిత్ సింగ్ వెల్లడించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.