Three Sisters Cracked Rajasthan Administrative Service Exam
Three sisters rajasthan administrative service exam : వారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిది రాజస్థాన్ లోని హనుమాన్‌ఘర్ జిల్లా. అక్కాచెల్లెళ్లు ముగ్గురూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.అంతేకాదు ముగ్గురు అక్కచెల్లెళ్లు అన్సూ, రీతూ, సుమన్ ముగ్గురూ ఏం చేసినా ఒకేలా చేస్తాం..సాధించి చూపిస్తాం అన్నట్లుగా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఆఫీసర్ ఉద్యోగం సంపాదించారు.
అంతేకాదు ఆ ముగ్గురి కంటే ముందు వారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు రోమా, మంజూలు కూడా ఆఫీసర్లుగా ఉన్నారు. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ల ఫోటోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్‌లో తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లు అయిన సిస్టర్స్ కు కంగ్రాట్స్ తెలిపారు. కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఒకే సర్వీస్ ఎగ్జామ్‌ను క్లియర్ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇప్పటికే రోమా, మంజూలు..ఆర్ఏఎస్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
దీంతో హనుమాన్‌ఘర్ జిల్లాలోని బైరుసరి గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆ అమ్మాయిల తండ్రి సహదేవ్ శరన్ ఓ సాధారణ రైతు కావటం విశేషం. ఆయన 8వ తరగతి వరకే చదువుకున్నారు. వారి తల్లి తల్లి లక్ష్మీ నిరక్ష్యరాసురాలు. భార్యాభర్తలు పెద్దగా చదువుకోకపోయినా వారికి చదువు విలువ తెలుసు. అందుకే ఆడపిల్లలకు వయస్సు రాగానే పెళ్లి చేసేయాలని అని బంధువులు చెప్పినా వినకుండా కూతుళ్లను మాత్రం చదివించారు.
తమలాకాకుండా కూతుళ్లు ఉన్నతస్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. వారి ఆశలను..ఆకాంక్షలను ఆడపిల్లలు నెరవేర్చారు. తమ సక్సెస్‌కు మా అమ్మానాన్నలే కారణమని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఆర్ఏఎస్ 2018 పరీక్ష ఫలితాలను జులై 13న రిలీజ్ చేశారు. ఆ పరీక్షల్లో జుంజునూ ముక్తా రావు తొలి ర్యాంక్ సాధించారు. చక్కటి ప్రతిభ కనబరిచిన అక్కాచెల్లెళ్లను సీఎం అశోక్ గెహ్లాట్ అభినందించారు.