Thugs open fire on farmers’ agitation : సింఘు సరిహద్దు వద్ద రైతుల ఆందోళనలో దుండగులు కాల్పులు జరిపారు. సోనీపథ్ దగ్గర అర్ధరాత్రి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగులు పంజాబ్ నెంబర్ ప్లేట్ కారులో వచ్చారు. కాల్పులు జరిపి ఆగంతకులు పరారయ్యారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అంతేకాకుండా రాకేష్ తికాయత్ కు సైతం బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెబుతున్నారు. అయితే బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మొన్ననే ఈ రైతుల ఆందోళనలు మొదలై 100 రోజులు దాటాయి. అయితే ఇంతలోనే ఇలా జరగడం ఆశ్చర్యకరంగా మారింది. ఇక వీరిపై ఎవరు కాల్పులు జరిపారన్నది ఇప్పుడు సంచలనంగా మారింది.
మరోవైపు మహిళా రైతుల పోరాట నినాదాలతో ఢిల్లీ సరిహద్దులు మార్మోగుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా….ఢిల్లీ సరిహద్దులకు భారీగా తరలివస్తున్నారు మహిళా రైతులు. ఇప్పటికే టిక్రీ బోర్డర్ దగ్గరకు చేరుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు మహిళలు నేతృత్వం వహించనున్నారు.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో 40వేల మందికి పైగా మహిళలు తరలివస్తున్నారు. మరికొందరు మహిళలు స్వయంగా ట్రాక్టర్లు నడుపుకుంటూ సరిహద్దులకు చేరుకుంటున్నారు. సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆందోళనల్లో మహిళా రైతులు పాల్గొంటారు. నిరసనలో పాటు వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర అనే అంశంపై దీక్షా స్థలిలో సదస్సు నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
ఇటీవలే మహిళా రైతుల పోరాటం టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై నిలిచింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న మహిళల రైతులను ముఖచిత్రంగా ముద్రించింది టైమ్ మ్యాగజైన్. అటు ఢిల్లీ సరిహద్దులకు మహిళలు భారీగా తరలివస్తుండడంతో భద్రత పెంచారు. భారీగా మహిళా పోలీసులను మోహరించారు.