అపార వన్యప్రాణులకు ఆవాసంగా..ఆలవాలంగా ఉన్న అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ లో ఓ వింత జరిగింది. మేకలు కనిపిస్తు గుటుక్కుమనించే రాయల్ బెంగాల్ టైగర్ మేకల మందలో దాక్కుని ప్రాణాలు దక్కించుకుంది. పరిస్థితులను బట్టి తప్పలేదు. రాయల్ బెంగాల టైగర్ అంటే పౌరుషానికి రాజసానికి పెట్టింది పేరు. అటువంటి అంత పెద్దపులి మేకల మందలో తలదాచుకోవటం వింతా విశేషమే మరి.
వివరాల్లోకి వెళితే..అసోంని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదనీరు కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. అపార వన్యప్రాణులకు ఆవాసంగా నిలుస్తున్న కజిరంగా అభయారణ్యం కూడా వరద నీటిలో చిక్కుకుంది. ఆ పార్కులో ఉన్న పెద్దపులులు తలో దిక్కులోని తలదాచుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాయి. వాటిలోని ఓ రాయల్ బెంగాల్ టైగర్ కు పాపం తగిన స్థలం దొరకలేదు. చలికి వణికిపోతోంది. ఆ పార్కు దగ్గరలో ఉన్న కంధూలిమారి గ్రామంలో ప్రవేశించింది. ఆ గ్రామంలో ఉన్న కమల్ అనే వ్యక్తికి పెంచుకుంటున్న మేకల కొట్టంలో ప్రవేశించి ఆ మేకల మందలోనే తలదాచుకుంది. బ్రతికితే చాలు అనుకుంటూ మేకల మందలో ఓ మూలకెళ్లి పడుకుంది.
సాధారణంగా మేకలు కనిపిస్తే గుటుక్కుమనిపించే పులి… కళ్లెదురుగా అన్ని మేకలు కనిపిస్తున్నా..చలికి వణికిపోతూ..రాత్రంతా అక్కడే ఉండిపోయింది. తెల్లవారింది. మేకలకు మేత వేద్దామని ఇంటి యజమాని కమల్ తల్లి మేకల కొట్టంలోకి వచ్చింది. మేకల మందలో పడుకుని ఉన్న పెద్దపులిని చూసింది. అదేమిటో అర్థం కాలేదు. దగ్గరకెళ్లి మీద చేయివేసి చూసింది. అది పెద్దపులని అర్థమై వణికిపోయింది. గుండె దడదడలాడిపోయింది.కాలు కదల్లేదు.అరుద్దామంటే నోరు పెగల్లేదు. శక్తినంతా కూడదీసుకుని ఇంట్లోకి పరుగెత్తింది. అలా ఇంట్లోకి వచ్చిన చాలాసేపటి వరకూ ఆమెకు గండె దడ..కాళ్లు వణుకు తగ్గలేదు.
తల్లి అలా వణికిపోవటం చూసిన కమల్ ఏంటమ్మా అని అడిగాడు. వణుకుతూనే విషయం చెప్పేసరికి తాను కూడా మేకల కొట్టంలోకి వెళ్లి చూడగా అక్కబ టైగర్ కు చూశాడు. కానీ తన మేకలకు అది ఎటువంటి హానీ చేయలేదని గ్రహించాడు. వర్షాలకు తడిసిపోయి చలితో తలదాచుకోవటానికి వచ్చిందని అనుకున్నాడు.
గంభీరంగా ఉండే పులి అలా చలికి వణికిపోతూ అలా పడుకుని ఉంటాన్ని తామందరం చూశామని, ఎంతో అలసిపోయి పడుకుందని అనుకుని అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపాడు. కానీ తెల్లవారి కాస్త వర్షం తగ్గాక అక్కడ నుంచి ఆ పులి వెళ్లిపోయిందని కమల్ తెలిపాడు. అదే విషయాన్ని అధికారులకు చెప్పామని తెలిపాడు.