టిక్ టాక్.. కుటుంబాన్ని కలిపింది

  • Publish Date - May 25, 2020 / 03:13 PM IST

కరోనా లాక్ డౌన్ ఎందరో వలసదారులను నానా ఇబ్బందులు పెడితే అతనికి మాత్రం వరంగా మారింది. రెండేళ్ల నుంచి కుటుంబానికి దూరమైన డెఫ్ ఆండ్ డమ్ లాక్ డౌన్ పుణ్యమా అని సొంత గూటికి చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చెందిన రోడ్డ వెంకటేశ్వర్లు పాల్వంచలో రోజూ కూలీ పనికి వెళ్తూ వుండేవాడు. ఇలా వెళ్లిన వెంకటేశ్వర్లు ఇంటికి రాలేదు. అలా రెండేళ్లు గడిచి పోయాయి. 

అతని భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అతని కోసం ఎంతగానో వెతికారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఆశలు వదులుకున్నారు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో బూర్గంపాడుకు చెందిన నాగేంద్ర బాబు టిక్ టాక్ వీడియో చూస్తుండగా వెంకటేశ్వర్లు కనిపించాడు. వెంటనే ఆ వీడియోలను అతని కుటుంబ సభ్యులకు చూపించాడు. 

వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు టిక్ టాక్ ఐడీ ఆధారంగా పంజాబ్ లోని లుధియానా ప్రాంతంగా గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులతో బూర్గంపాడు పోలీసులు కమ్యూనికేట్ చేసి అతని ఆచూకీ గుర్తించారు. చివరికి వెంకటేశ్వర్లు కొడుకు పెద్దిరాజు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్న తండ్రిని కారులో స్వగ్రామానికి తీసుకొచ్చాడు. 

రెండేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి రాష్ట్రాలు దాటి దేశ సరిహద్దు రాష్ట్రానికి వెళ్లినా లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ దగ్గరికి చేర్చిందని గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.